1 సమూయేలు 27
27
1తరువాత దావీదు–నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలుచేత నాశన మగుదును; నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతనిచేతిలోనుండి తప్పించుకొందునని అనుకొని 2లేచి తనయొద్దనున్న ఆరువందలమందితోకూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. 3దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమతమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
4దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను. 5అంతట దావీదు–రాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా 6ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
7దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు. 8అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయులమీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి. ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా 9దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱెలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను. 10ఆకీషు–ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు –యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను. 11ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు. 12–దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 27: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.