2 దినవృత్తాంతములు 13

13
1రాజైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు అబీయా యూదావారిమీద ఏలనారం భించెను. 2అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను; అతని తల్లిపేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె.
3అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధముచేసెను; యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. 4అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగా – యరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి. 5ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని#13:5 ఉప్పు నిబంధన. నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా. 6అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానునిమీద తిరుగుబాటు చేసెను. 7సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. 8ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి. 9మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱె పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. 10అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించిన వారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. 11వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టిం చుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాముగాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. 12ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదు నట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీపితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు.
13యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను. 14యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి. 15అప్పుడు యూదావారు ఆర్భటించిరి; యూదావారు ఆర్భటించి నప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున 16ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున 17అబీయాయును అతని జనులును వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో అయిదు లక్షలమంది పరాక్రమశాలులు హతులైరి. 18ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరిగాని యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయమొందిరి. 19అబీయా యరొబామును తరిమి, బేతేలును దాని గ్రామములను యెషానాను దాని గ్రామములను ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను.
20అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను. 21అబీయా వృద్ధినొందెను, అతడు పదునాలుగు మంది భార్యలను వివాహము చేసికొని యిరువది యిద్దరు కుమారులను పదునారుగురు కుమార్తెలను కనెను. 22అబీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యలనుగూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులనుగూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయ బడియున్నది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి