2 రాజులు 18
18
1ఇశ్రాయేలురాజును ఏలా కుమారుడునైన హోషేయ యేలుబడిలో మూడవ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా యేలనారంభించెను. 2అతడు ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె; ఆమెకు అబీ అని పేరు. 3తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను. 4ఉన్నతస్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి యుండిరి 5అతడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదారాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు. 6అతడు యెహో వాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొను చుండెను. 7కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను. 8మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.
9రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారుడగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్టణముమీదికి వచ్చి ముట్టడివేసెను. 10మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయయేలు బడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. 11తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి. 12అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.
13రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవ త్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా 14యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి–నావలన తప్పు వచ్చినది ; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. 15కావున హిజ్కియా యెహోవామందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను. 16మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను. 17అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా 18హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, రాజ్యపుదస్తావేజులమీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. 19అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను –ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు–మహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా–నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? 20యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు? 21నలిగిన రెల్లు వంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికిని అట్టివాడే. 22–మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. –యెరూషలేమందున్న యీ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా? 23కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను. 24అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే. 25యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు; –ఆ దేశముమీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. 26హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నా యోవాహు అనువారు–చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా 27రబ్షాకే–ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి 28గొప్పశబ్దముతో యూదాభాషతో ఇట్లనెను–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా 29–హిజ్కియాచేత మోసపోకుడి; నా చేతిలోనుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. 30యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి–యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. 31హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా–నాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. 32అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున–యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. 33ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా? 34హమాతు దేవతలు ఏమాయెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మాచేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా? 35యెహోవా మాచేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మాచేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను. 36అయితే–అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి. 37గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 18: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.