2 రాజులు 21

21
1మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్ల వాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా. 2అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. 3తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను. 4మరియు – నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవామందిరమందు బలిపీఠములను కట్టించెను. 5మరియు యెహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశసమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. 6అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుకచేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను 7యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి–ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలోనుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవామందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. 8మరియు–ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని, నా సేవకుడగు మోషే వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనినయెడల వారి పితరులకు నేనిచ్చిన దేశములోనుండి వారి పాదములను ఇక తొలగి పోనియ్యనని యెహోవా సెలవిచ్చినమాట వారు వినక 9ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. 10కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను. 11– యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను. 12కావున ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా– వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు 13నేను షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేముమీద సాగలాగుదును; ఒకడు పళ్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచి వేసెదను. 14మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను. 15వారు తమపితరులు ఐగుప్తుదేశములోనుండి వచ్చిన నాటనుండి నేటివరకు నా దృష్టికి కీడుచేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరిచేత దోచబడి నష్టము నొందుదురు. 16మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడతనడిచి, యూదా వారిని పాపములో దింపినదిగాక యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. 17మనష్షే చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతడు చేసిన దోషమునుగూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 18మనష్షే తన పితరులతోకూడ నిద్రించి ఉజ్జాయొక్క తోటలో తన నగరుదగ్గర సమాధిచేయబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.
19ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేమునందు రెండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొట్బయూరివాడగు హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు. 20అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. 21-22తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు, తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. 23ఆమోను సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా 24దేశపు జనులురాజైన ఆమోనుమీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. 25ఆమోను చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 26ఉజ్జాయొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యోషీయా అతనికి మారుగా రాజాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 21: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి