2 సమూయేలు 1

1
1దావీదు అమాలేకీయులను హతముచేసితిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను. 2మూడవదినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్నదండులోనుండి వచ్చెను. 3అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారముచేయగా దావీదు–నీ వెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు–ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను. 4–జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడు–జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. 5–సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వానినడుగగా వాడిట్లనెను 6-7–గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు–చిత్తము నా యేలినవాడా అని నేనంటిని. 8-10– నీవెవడవని అతడు నన్నడుగగా–నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు–నా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. 11దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్దనున్నవారందరును ఆలాగున చేసి 12సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలి రని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రమువరకు ఉపవాసముండిరి. 13తరువాత దావీదు–నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవానినడుగగా వాడు–నేను ఇశ్రాయేలుదేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను. 14-16అందుకు దావీదు–భయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి–నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.
17-18యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానునుగూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా–
19ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారు నీ ఉన్నతస్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి.
20ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి.
21గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక.
బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు#1:21 తైలముచేత అభిషేకింపబడిన. సౌలు డాలును పారవేయబడెను.
22హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండ యోనాతాను విల్లు వెనుకతియ్యలేదు ఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు.
23సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగల వారుగాను ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారు వారు పక్షిరాజులకంటె వడిగలవారు సింహములకంటె బలముగలవారు.
24ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు.
25యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు నీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను.
26నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.
27అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్ధులు నశించిపోయిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 1: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి