2 సమూయేలు 15

15
1ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను. 2ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒకతట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి–నీవు ఏ ఊరివాడవని యడుగుచుండెను–నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా 3అబ్షాలోము–నీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి 4నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను. 5మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను. 6తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను.
7-8నాలుగు#15:7-8 పాఠాంతరము, నలువది. సంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి–నీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగా–యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించె దనని మ్రొక్కు కొంటిని గనుక, నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా 9రాజు–సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. 10అబ్షాలోము–మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను. 11విందునకు పిలువబడియుండి రెండువందలమంది యెరూషలేములోనుండి అబ్షాలోముతోకూడ బయలుదేరి యుండిరి, వీరు ఏమియు తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి. 12మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోముదగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహుబలమాయెను.
13ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా 14దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠా త్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి. 15అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి–చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము. 16అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. 17రాజును అతని యింటివారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి. 18అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందలమంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి. 19రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని– నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతోకూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము. 20నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగు లాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా 21ఇత్తయి–నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను. 22అందుకు దావీదు –ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి. 23వారు సాగిపోవుచుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి. 24సాదోకును లేవీయులందరును దేవుని నిబంధనమందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను. 25అప్పుడు రాజు సాదోకును పిలిచి–దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి 26దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, –నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి 27యాజకుడైన సాదోకుతో ఇట్లనెను–సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను. 28ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును. 29కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.
30అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్లెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి. 31అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు–యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. 32దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొని వచ్చి రాజును దర్శనము చేసెను. 33రాజు–నీవు నాతోకూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు; 34నీవు పట్టణమునకు తిరిగి పోయి–రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు. 35అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను. 36సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను. 37దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 15: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి