2 సమూయేలు 9
9
1– యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడిగెను. 2సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు–సీబావు నీవేగదా అని అడుగగా అతడు–నీ దాసుడనైన నేనే సీబాను అనెను. 3రాజు–యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబా–యోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను. 4–అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా–చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను. 5అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పించెను. 6సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారముచేయగా దావీదు–మెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడు–చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను. 7అందుకు దావీదు–నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా 8అతడు నమస్క రించి–చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను. 9అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి–సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించియున్నాను; 10కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి. 11–నా యేలినవాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసెదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనముచేయుచుండెను. 12మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్నవారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. 13మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనముచేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 సమూయేలు 9: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.