అపొస్తలుల కార్యములు 16:16-33

అపొస్తలుల కార్యములు 16:16-33 TELUBSI

మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపెట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి–ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి–నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిరి. అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి–ఈ మనుష్యులు యూదులై యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.