అపొస్తలుల కార్యములు 16:16-33
అపొస్తలుల కార్యములు 16:16-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపెట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి–ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి–నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిరి. అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి–ఈ మనుష్యులు యూదులై యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.
అపొస్తలుల కార్యములు 16:16-33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరొక రోజు మేము ప్రార్థన స్థలానికి వెళ్తుండగా, దయ్యం పట్టి సోదె చెప్పే ఒక బానిస స్త్రీ మాకు ఎదురయింది. ఆమె సోదె చెప్తూ తన యజమానికి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేది. ఆమె పౌలును మరియు మమ్మల్ని వెంబడిస్తూ, “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తున్నారు” అని బిగ్గరగా అరిచి చెప్పింది. ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ ఉంది. చివరికి ఒక రోజు పౌలు చాలా చికాకుపడి ఆమె వైపు తిరిగి దయ్యంతో, “నీవు ఈమె నుండి బయటకు వెళ్లిపో అని యేసు క్రీస్తు పేరట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను!” అని గద్దించాడు. వెంటనే ఆ దయ్యం ఆమెను వదలిపోయింది. ఆమె యజమానులు ఇక వారికి ఆదాయం వచ్చే మార్గమే లేకుండా పోయిందని గుర్తించి, వారు పౌలు సీలలను పట్టుకొని ఆ పట్టణ సంతవీధులలో ఉండే అధికారుల వద్దకు వారిని ఈడ్చుకొని పోయారు. వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ, మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు” అని చెప్పారు. జనసమూహం కూడా వారి మీద దాడి చేశారు, కనుక న్యాయాధికారులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారిని తీవ్రంగా దెబ్బలు కొట్టి, చెరసాలలో పడవేసి, భద్రంగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. అతడు ఈ ఆదేశాలను పొందుకొని, వారిని చెరసాలలోని లోపలి గదిలో కాళ్ళను చెక్క మొద్దులలో ఇరికించి బంధించాడు. సుమారు అర్ధరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, ప్రతి ఒక్కరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు. చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు. ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు. అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు మరియు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకొన్నారు.
అపొస్తలుల కార్యములు 16:16-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది. ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది. ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు. న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు” అని చెప్పారు. అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు. మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు. చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.
అపొస్తలుల కార్యములు 16:16-33 పవిత్ర బైబిల్ (TERV)
ఒకసారి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక బానిస పిల్ల కనిపించింది. ఆమెకు సోదె చెప్పే శక్తిగల “పుతోను” అనే దయ్యము పట్టివుంది. ఆమె సోదె చెప్పటం వల్ల ఆమె యజమానులు చాలా డబ్బు గడించారు. ఆమె పౌలును, మమ్మును అనుసరిస్తూ, “వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. రక్షణకు దారి చూపుతున్నారు” అని బిగ్గరగా కేక పెట్టేది. ఇలా చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుగు చెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు క్రీస్తు పేరిట ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది. ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు చేసుకొనే ఆశ నశించిందని గ్రహించి పౌలును, సీలను బంధించారు. వాళ్ళను బహిరంగంగా రోమా సైనికాధికారుల ముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు యూదులు. మన పట్టణంలో అలజడి లేపుతున్నారు. రోమా పౌరులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్ళు మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా న్యాయం కాదు” అని అన్నారు. ప్రజల గుంపు పౌలు, సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు. చావకొట్టి, వాళ్ళను చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు. కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేసాడు. అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బంధీలు వింటున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి. చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు. ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు. వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు. ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు. ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోనివాళ్ళు బాప్తిస్మము పొందారు.
అపొస్తలుల కార్యములు 16:16-33 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మరొక రోజు మేము ప్రార్థన స్థలానికి వెళ్తుండగా, దయ్యం పట్టి సోదె చెప్పే ఒక బానిస స్త్రీ మాకు ఎదురయింది. ఆమె సోదె చెప్తూ తన యజమానికి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేది. ఆమె పౌలును మమ్మల్ని వెంబడిస్తూ, “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తున్నారు” అని బిగ్గరగా అరిచి చెప్పింది. ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ ఉంది. చివరికి ఒక రోజు పౌలు చాలా చికాకుపడి ఆమె వైపు తిరిగి దయ్యంతో, “నీవు ఈమె నుండి బయటకు వెళ్లిపో అని యేసు క్రీస్తు పేరట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను!” అని గద్దించాడు. వెంటనే ఆ దయ్యం ఆమెను వదిలిపోయింది. ఆమె యజమానులు ఇక వారికి ఆదాయం వచ్చే మార్గమే లేకుండా పోయిందని గుర్తించి, వారు పౌలు సీలలను పట్టుకుని ఆ పట్టణ సంతవీధులలో ఉండే అధికారుల దగ్గరకు వారిని ఈడ్చుకొని పోయారు. వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ, మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు” అని చెప్పారు. జనసమూహం కూడా వారి మీద దాడి చేశారు, కాబట్టి న్యాయాధికారులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారిని తీవ్రంగా దెబ్బలు కొట్టి, చెరసాలలో పడవేసి, భద్రంగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. అతడు ఈ ఆదేశాలను పొందుకొని, వారిని చెరసాలలోని లోపలి గదిలో కాళ్లను చెక్క మొద్దులలో ఇరికించి బంధించాడు. సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు. చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు. ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు. అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకున్నారు.