అపొస్తలుల కార్యములు 26

26
1అగ్రిప్ప పౌలును చూచి–నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను–
2అగ్రిప్పరాజా, తమరు యూదులలోఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక 3యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. 4మొదటినుండి యెరూషలేములో నా జనముమధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు. 5వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. 6ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీ క్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. 7మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు. 8దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు? 9నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; 10యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; 11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని. 12అందునిమిత్తము నేను ప్రధానయాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా 13రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. 14మేమందరమును నేలపడినప్పుడు–సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. 15అప్పుడు నేను–ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను–నీవు హింసించుచున్న యేసును. 16-18నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; నేను ఈ ప్రజల వలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను; వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను. 19కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక 20మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. 21ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి; 22అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; –క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని 23ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.
24అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు–పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. 25అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. 26రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు. 27అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. 28అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. 29అందుకు పౌలు–సులభముగానో దుర్లభము గానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.
30అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి 31–ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి. 32అందుకు అగ్రిప్ప–ఈ మనుష్యుడు–కైసరు ఎదుట చెప్పు కొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

అపొస్తలుల కార్యములు 26: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి