అపొస్తలుల కార్యములు 6:8-15

అపొస్తలుల కార్యములు 6:8-15 TELUBSI

స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మ ను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు–వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు–ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.