అపొస్తలుల కార్యములు 6:8-15

అపొస్తలుల కార్యములు 6:8-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

స్తెఫెను, దేవుని కృపతో శక్తితో నిండి ప్రజలమధ్య గొప్ప అద్భుతాలు సూచకక్రియలు చేశాడు. అయితే స్వతంత్రుల సమాజమందిరానికి (అలా పిలువబడేది) చెందిన కురేనీయులు అలెక్సంద్రియ, అలాగే కిలికియా ఆసియా ప్రాంతాల నుండి వచ్చిన యూదులు స్తెఫెనుతో వాదించడం మొదలుపెట్టారు. కాని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫెనుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేకపోయారు. కాబట్టి వారు రహస్యంగా కొందరిని ప్రేరేపించి, “మోషే మీద దేవుని మీద స్తెఫెను దైవదూషణ చేయడం మేము విన్నాం” అని చెప్పించారు. ప్రజలను, యూదా నాయకులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫెనును పట్టుకుని న్యాయసభ ముందు నిలబెట్టారు. వారు అబద్ధ సాక్షులను తీసుకువచ్చి, “ఇతడు ఈ పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపలేదు. నజరేయుడైన యేసు ఈ స్థలాన్ని పడగొట్టి, మోషే మనకు ఇచ్చిన ఆచారాలను మార్చేస్తాడని ఇతడు చెప్పడం మేము విన్నాం” అని చెప్పించారు. న్యాయసభలో కూర్చున్న వారంతా స్తెఫెను వైపు సూటిగా చూసినప్పుడు, అతని ముఖం ఒక దేవదూత ముఖంలా వారికి కనబడింది.

అపొస్తలుల కార్యములు 6:8-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు. అయితే ‘స్వతంత్రుల సమాజం’ అనే చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు. అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు. ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు. అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, “ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము” అని చెప్పారు. సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.

అపొస్తలుల కార్యములు 6:8-15 పవిత్ర బైబిల్ (TERV)

దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు. ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు. తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.

అపొస్తలుల కార్యములు 6:8-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మ ను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు–వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు–ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.