ద్వితీయోపదేశకాండము 28

28
1నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. 2నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 3నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు; 4నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును; 5నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. 6నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు. 7నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు. 8నీ కొట్లలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. 9నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనినయెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితజనముగా నిన్ను స్థాపించును. 10భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు. 11మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. 12యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవుచేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు 13నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికిగాని యెడమకుగాని తొలగి 14అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
15నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. 16పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; 17నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; 18నీ గర్భఫలము నీ భూమిపంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; 19నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు. 20నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. 21నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. 22యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గముచేతను కంకికాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. 23నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును. 24యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును. 25యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటిలోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు. 26నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. 27యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్ఠుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. 28వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును. 29అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును, 30స్త్రీని ప్రధానము చేసికొందువుగాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. 31నీ యెద్దు నీ కన్నులయెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు. 32నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచి చూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును. 33నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. 34నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును. 35యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడలమీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. 36యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు 37యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు. 38విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలు దాని తినివేయును. 39ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును. 40ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండునుగాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును. 41కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు. 42మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. 43నీ మధ్యనున్న పరదేశి నీకంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు. 44అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు. 45నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు. 46మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. 47నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు 48గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు. 49యెహోవా దూరమైయున్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, 50క్రూరముఖము కలిగి వృద్ధులను యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరివచ్చునట్లు నీమీదికి రప్పిం చును. 51నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయువరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునేగాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. 52మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. 53అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమా ర్తెలయొక్కయు మాంసమును తిందువు. 54మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున 55అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు. 56-57నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును. 58నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల 59యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును. 60నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును. 61మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. 62నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు. 63కాబట్టి మీకు మేలుచేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. 64దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. 65ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. 66నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును. 67నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున–అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున–అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. 68మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను మీ శత్రువులకు మిమ్మును మీరు అమ్మ జూపు కొందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 28: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి