ఎస్తేరు 3
3
1ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను. 2కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా 3రాజు గుమ్మముననున్న రాజసేవకులు–నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి. 4ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు–మొర్దకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు–నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి యుండెను. 5మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి 6మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలో చించెను. 7రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమమాసమునవారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవనెలవరకు వేయుచు వచ్చిరి. 8అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా –మీ రాజ్య సంస్థా నములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. 9రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా 10రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి 11–ఆ వెండి నీకియ్య బడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. 12మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క లేఖికులు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆయా జనములభాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను. 13అదారు అను పండ్రెండవనెల పదమూడవ దినమందు యౌవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను. 14మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. 15అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆయాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎస్తేరు 3: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.