ఎస్తేరు 9
9
1రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవనెల పదమూడవదినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. 2యూదులురాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడుచేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి. 3మొర్దకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధికారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి. 4మొర్దకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానములన్నిటియందు వ్యాపించెను. 5యూదులు తమ శత్రువులనందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి. 6షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి. 7హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామానుయొక్క పదిమంది కుమారులైన పర్షందాతా 8దల్పోను అస్పాతా పోరాతా 9అదల్యా అరీదాతా పర్మష్తా 10అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. 11ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా 12రాజు రాణియైన ఎస్తేరుతో–యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా 13ఎస్తేరు–రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనెను. 14ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామానుయొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి. 15షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 16రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించు కొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది యయిదువేలమందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితే వారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు. 17పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతో షముగా నుండిరి. 18షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి. 19కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసు లైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి–అది విందుచేయదగిన శుభదినమను కొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.
20మొర్దకై యీ సంగతులనుగూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి 21–యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు 22విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను. 23అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని యొప్పుకొనిరి. 24యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి, వేయించియుండగా 25ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తల పెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి,వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. 26కావున ఆ దినములు పూరు అను పేరునుబట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చినదానినిబట్టియు 27యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు, 28పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతివారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. 29అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దకైయును ఖండితముగా వ్రాయించిరి. 30మరియు యూదుడైన మొర్దకైయును రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా 31ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను. 32ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎస్తేరు 9: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.