నిర్గమకాండము 13

13
1మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను 2–ఇశ్రాయేలీయులలో మనుష్యులయొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను. 3మోషే ప్రజలతో నిట్లనెను–మీరు దాస గృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు. 4ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. 5యెహోవా–నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 6ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవదినమున యెహోవాకు పండుగ ఆచరింపవలెను. 7పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు. 8మరియు ఆ దినమున నీవు–నేను ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. 9యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నులమధ్య జ్ఞాపకార్థముగా ఉండును. 10కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.
11యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత 12ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును. 13ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను. 14ఇకమీదట నీ కుమారుడు–ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి–బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. 15ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను. 16బాహు బలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచనగాను నీ కన్నులమధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.
17మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు–ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. 18అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి. 19మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడు–దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయులచేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను. 20వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. 21వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. 22ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి