నిర్గమకాండము 4

4
1అందుకు మోషే–చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు–యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా 2యెహోవా–నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు–కఱ్ఱ అనెను. 3అప్పుడాయన–నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. 4అప్పుడు యెహోవా–నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతనిచేతిలో కఱ్ఱ ఆయెను. 5ఆయన –దానిచేత వారు తమపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను. 6మరియు యెహోవా–నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. 7తరువాత ఆయన–నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. 8మరియు ఆయన–వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల రెండవ దానిబట్టి విందురు. 9వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను. 10అప్పుడు మోషే–ప్రభువా, ఇంతకుమునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా 11యెహోవా–మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. 12కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను. 13అందుకతడు–అయ్యో ప్రభువా, నీవు పంప తలంచినవానినే పంపుమనగా 14ఆయన మోషేమీద కోపపడి–లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును; 15నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయ వలసినదానిని మీకు బోధించెదను. 16అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. 17ఈ కఱ్ఱను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను.
18అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లి–సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో–క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను. 19అంతట యెహోవా–నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా, 20మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేతపట్టుకొని పోయెను. 21అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు. 22అప్పుడు నీవు ఫరోతో–ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు; 23నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. 24అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా 25సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి–నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటి వైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను. 26అప్పుడు ఆమె–ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.
27మరియు యెహోవా–మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను. 28అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.
29తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి, 30యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలనుచేయగా జనులు నమ్మిరి. 31మరియు–యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి