ఎజ్రా 4
4
1అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణయయినవారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని 2జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానులయొద్దకును వచ్చి–మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోనుయొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. 3అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులును–మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు; మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. 4దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. 5మరియు పారసీకదేశపు రాజైన కోరెషుయొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యావేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. 6మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులనుగూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.
7అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కినవారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది. 8మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి. 9అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును 10ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కినవారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. 11వీరు రాజైన అర్తహ షస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా 12తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. 13కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. 14మేము రాజుయొక్క ఉప్పుతిన్నవారము#4:14 జీవనోపాధి. గనుక రాజునకు నష్టమురాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియ జేసితిమి. 15మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును. 16కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. 17అప్పుడు రాజు–మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్షయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతలనుండు తక్కినవారికిని–మీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా 18–మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము. 19అందువిషయమై మా యాజ్ఞనుబట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. 20మరియు యెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. 21కాబట్టి యిప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి. 22ఇది తప్పకుండ చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండ చూడుడి అని సెలవిచ్చెను. 23రాజైన అర్తహషస్త పంపించిన యుత్తరముయొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరిపక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతముచేతను అధికారముచేతను వారు పని ఆపునట్లుచేయగా 24యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎజ్రా 4: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.