హోషేయ 11
11
1ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని. 2ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. 3ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు 4ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని; ఒకడు పశువులమీది కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని 5ఐగుప్తుదేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరురాజు వారిమీద ప్రభుత్వము చేయును. 6వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయును. 7నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతునితట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు 8ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విస ర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది. 9నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను. 10వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు. 11వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.
12ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హోషేయ 11: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.