లేవీయకాండము 24
24
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2–దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. 3ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 4అతడు నిర్మలమైన దీపవృక్షముమీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.
5నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను. 6యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లమీద ఆరేసి భక్ష్యములుగల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను. 7ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. 8యాజకుడు ప్రతి విశ్రాంతిదినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయులయొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. 9అది అహరోనుకును అతని సంతతివారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకుచేయు హోమములలో అది అతి పరిశుద్ధము.
10ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయులమధ్యకు వచ్చెను. 11ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసికొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె 12యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
13అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 14–శపించినవానిని పాళెము వెలుపలికి తీసికొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను. 15మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను. 16యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను. 17ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను. 18జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. 19ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసినయెడలవాడు చేసినట్లు వానికి చేయవలెను. 20విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను.వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను. 21జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను. 22మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. 23కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెను–శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయకాండము 24: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.