లూకా 24:36-53

లూకా 24:36-53 TELUBSI

వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారిమధ్యను నిలిచి–మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన–మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పెట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదము లను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన–ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి –క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.