లూకా 24:36-53
లూకా 24:36-53 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగా, యేసు తానే వారి మధ్య నిలబడి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో అన్నారు. తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి? నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు” అని చెప్పారు. ఆయన ఇలా చెప్పి, తన చేతులు మరియు పాదాలు వారికి చూపించారు. అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, “ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?” అని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ఆయన దానిని తీసికొని వారి ముందే తిన్నారు. తర్వాత ఆయన వారితో, “మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాలలోను, కీర్తనల పుస్తకంలోను నన్ను గురించి వ్రాయబడినవి అన్ని నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా!” అని అన్నారు. అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు. ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని, యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం మరియు పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. ఈ సంగతులన్నిటికి మీరే సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ వద్దకు పంపిస్తున్నాను కనుక పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకొనే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు. ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.
లూకా 24:36-53 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు. “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.
లూకా 24:36-53 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు. వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు. ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు. వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు. ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు. ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు. అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు! పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది. మీరు వీటికి సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు. వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.
లూకా 24:36-53 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారిమధ్యను నిలిచి–మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన–మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పెట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదము లను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన–ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి –క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.