వారు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగా, యేసు తానే వారి మధ్య నిలబడి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో అన్నారు. తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి? నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు” అని చెప్పారు. ఆయన ఇలా చెప్పి, తన చేతులు మరియు పాదాలు వారికి చూపించారు. అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, “ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?” అని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ఆయన దానిని తీసికొని వారి ముందే తిన్నారు. తర్వాత ఆయన వారితో, “మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాలలోను, కీర్తనల పుస్తకంలోను నన్ను గురించి వ్రాయబడినవి అన్ని నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా!” అని అన్నారు. అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు. ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని, యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం మరియు పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. ఈ సంగతులన్నిటికి మీరే సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ వద్దకు పంపిస్తున్నాను కనుక పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకొనే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు. ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.
Read లూకా 24
వినండి లూకా 24
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 24:36-53
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు