మత్తయి 25:1-13

మత్తయి 25:1-13 TELUBSI

పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడు–మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.