మత్తయి 25:1-13
మత్తయి 25:1-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“పరలోక రాజ్యం తమ దీపాలను పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కోడానికి బయలుదేరిన పదిమంది కన్యలను పోలి ఉంది. వీరిలో ఐదుగురు బుద్ధిలేని వారు, ఐదుగురు బుద్ధిగలవారు. బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకొన్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు. బుద్ధిగలవారు, తమ దీపాలతో పాటు సీసాల్లో నూనె తీసుకువెళ్లారు. పెండ్లికుమారుడు రావడానికి ఆలస్యం అయ్యింది, అంతలో వారందరు కునికి నిద్రపోయారు. “అర్ధరాత్రి వేళలో, ‘ఇదిగో, పెండ్లికుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోడానికి రండి!’ అనే కేక వినబడింది. “అప్పుడు ఆ కన్యలందరు లేచి తమ దీపాలను సరిచేసికొని వెలిగించుకున్నారు. గాని బుద్ధిలేని కన్యలు బుద్ధిగల కన్యలతో, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి; మాకు కొంచెం నూనెను ఇవ్వండి’ అని అడిగారు. “అందుకు బుద్ధిగల కన్యలు, ‘లేదు, మాకు మీకు అది సరిపోదు, మీరు అమ్మేవారి దగ్గరకు పోయి కొనుక్కొండి’ అని చెప్పారు. “వారు కొనడానికి వెళ్తున్నప్పుడే, పెండ్లికుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్న కన్యలు ఆయనతో కూడ పెండ్లివిందుకు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తలుపు మూయబడింది. “ఆ తర్వాత మిగతావారు వచ్చి, ‘ప్రభువా, ప్రభువా, మా కొరకు తలుపు తెరవండి!’ అన్నారు. “కాని అతడు, ‘నేను మీతో నిజం చెప్తున్నా, మీరు ఎవరో నాకు తెలియదు’ అని జవాబిచ్చాడు. “కాబట్టి మెలకువగా ఉండండి, ఎందుకంటే ఆ దినము కాని ఆ గంట కాని మీకు తెలియదు” అని చెప్పారు.
మత్తయి 25:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకుని బయలుదేరారు. వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు. తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు. తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు. పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రపోయారు. అర్థరాత్రి, ‘ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి’ అనే పిలుపు వినిపించింది. అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు. అయితే తెలివి తక్కువవారు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?’ అని తెలివైన వారిని అడిగారు. అందుకు వారు, ‘మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి’ అని చెప్పారు. వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపు మూశారు. ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ‘ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి’ అని అడిగారు. కాని ఆయన, ‘నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు. ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకుని ఉండండి.
మత్తయి 25:1-13 పవిత్ర బైబిల్ (TERV)
“దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు. “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు. “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు. “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు. “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది. “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు. “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు. “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
మత్తయి 25:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడు–మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.