మత్తయి 25:1-13

మత్తయి 25:1-13 IRVTEL

“పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకుని బయలుదేరారు. వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు. తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు. తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు. పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రపోయారు. అర్థరాత్రి, ‘ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి’ అనే పిలుపు వినిపించింది. అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు. అయితే తెలివి తక్కువవారు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?’ అని తెలివైన వారిని అడిగారు. అందుకు వారు, ‘మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి’ అని చెప్పారు. వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపు మూశారు. ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ‘ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి’ అని అడిగారు. కాని ఆయన, ‘నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు. ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకుని ఉండండి.