నెహెమ్యా 6

6
1నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టియుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని 2సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి–ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి. 3అందుకు నేను–నేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. 4వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆప్రకారమే నేను మరల ప్రత్యుత్తరమిచ్చితిని. 5అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను. 6అందులో–వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, 7యూదులకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటనచేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును–రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, –అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. 8ఈ పని చేయలేకుండ మేమశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింప జూచిరిగాని 9నేను–ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము.
10అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్బంధింపబడెను. అతడు–రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా 11నేను–నావంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. 12అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని 13ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపునట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి. 14నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసికొనుము.
15ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువదియయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. 16అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజనులందరు జరిగినపని చూచినప్పుడును, వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి. 17ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను. 18అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. 19వారు నా యెదుట అతని గుణాతిశయములనుగూర్చి మాటలాడుచువచ్చిరి, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టు టకే టోబీయా పత్రికలు పంపెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నెహెమ్యా 6: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి