సంఖ్యాకాండము 9

9
1ఐగుప్తుదేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను. 3దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవదినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను. 4కాబట్టి మోషే –పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. 5యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. 6కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి. 7వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో – నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతిమి; యెహోవా అర్పణమును దాని నియామకకాలమున ఇశ్రాయేలీయులమధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా 8మోషే–నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.
9అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము 10–మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను. 11వారు రెండవనెల పదునాలుగవదినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. 12వారు మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడ లన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను. 13ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానినయెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. 14మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
15వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను. 16నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను. 17ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి. 18యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పునవారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి. 19ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి. 20మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాటచొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాటచొప్పుననే ప్రయాణము చేసిరి. 21ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచినయెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. 22ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. 23యెహోవా మాటచొప్పునవారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పునవారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 9: TELUBSI

హైలైట్

కాపీ

సరిపోల్చండి

షేర్ చేయి

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి