సామెతలు 22
22
1గొప్ప ఐశ్వర్యముకంటె మంచిపేరును
వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.
2ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు
వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.
3బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును
జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
4యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ
మునకు ప్రతిఫలము
ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
5ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి
తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా
ఉండును.
6బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము
వాడు పెద్దవాడైనప్పుడు#22:6 వృద్ధుడైనప్పుడు. దానినుండి తొలగిపోడు.
7ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును
అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.
8దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును
వాని క్రోధమను దండము కాలిపోవును.
9దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని
కిచ్చును
అట్టివాడు దీవెననొందును.
10తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు
మానును
పోరు తీరి అవమానము మానిపోవును.
11హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు
పలుకువానికి రాజు స్నేహితుడగును.
12యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును.
విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.
13సోమరి –బయట సింహమున్నది
వీధులలో నేను చంపబడుదుననును.
14వేశ్య నోరు లోతైనగొయ్యి
యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.
15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా
పుట్టును
శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
16లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయముచేయు
వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.
17చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము
నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.
18నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతోమంచిది
పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము.
19నీవు యెహోవాను ఆశ్రయించునట్లు
నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి
యున్నాను?
20నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర
మిచ్చునట్లు
సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై
21ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు
నేను నీకొరకు రచించితిని.
22దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు
గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.
23యెహోవావారి పక్షమున వ్యాజ్యెమాడును
ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును.
24కోపచిత్తునితో సహవాసము చేయకుము
క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము
25నీవు వాని మార్గములను అనుసరించి
నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
26చేతిలో చెయ్యి వేయువారితోను
అప్పులకు పూటబడువారితోను చేరకుము.
27చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా
వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
28నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని
నీవు తీసివేయకూడదు.
29తన పనిలో నిపుణతగలవానిని చూచితివా?
అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 22: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.