ప్రకటన 14

14
1మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి. 2మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. 3వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. 4వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడి కెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు. 5వీరినోట ఏ అబద్ధమును కనబడ లేదు; వీరు అనింద్యులు.
6అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. 7అతడు–మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
8వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి–మోహోద్రేకముతోకూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.
9మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను– ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవ డైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల 10ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధదూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును. 11వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడలవాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు. 12దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
13అంతట–ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
14మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. 15అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి –భూమి పైరుపండి యున్నది,#14:15 మూలభాషలో–యెండిపోయియున్నది. కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను. 16మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.
17ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతనియొద్దను వాడిగల కొడవలియుండెను. 18మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచి–భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. 19కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను 20ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్లెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ప్రకటన 14: TELUBSI

హైలైట్

కాపీ

సరిపోల్చండి

షేర్ చేయి

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి