1 రాజులు 1

1
అదోనియా రాజ్యకాంక్ష
1దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. వారు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెచ్చదనం కలగడం లేదు. 2కాబట్టి వారు అతనితో “మా యజమాని, రాజు అయిన నీ కోసం మంచి యవ్వనంలో ఉన్న కన్యను వెతకడం మంచిది. ఆమె నీ దగ్గర ఉండి నిన్ను కనిపెట్టుకుని నీకు వెచ్చదనం కలిగించడానికి నీ కౌగిలిలో పడుకుంటుంది” అని చెప్పారు.
3ఇశ్రాయేలు దేశం అంతటా వెతికి, షూనేము గ్రామానికి చెందిన అబీషగు అనే యువతిని చూసి ఆమెను రాజు దగ్గరికి తీసుకు వచ్చారు. 4ఆమె చూడ చక్కనిది. ఆమె రాజును కనిపెట్టుకుని పరిచర్య చేస్తున్నది గాని రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు.
5ఆ సమయంలో దావీదుకు హగ్గీతు వల్ల పుట్టిన అదోనీయా గర్వించి “నేనే రాజునవుతాను” అనుకున్నాడు. కాబట్టి అతడు రథాలనూ గుర్రపు రౌతులనూ తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది మనుషులనూ ఏర్పాటు చేసుకున్నాడు. 6అతని తండ్రి దావీదు అతడు బాధ పడతాడేమోనని “నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?” అని ఎప్పుడూ అడగలేదు. అతడు చాలా అందగాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. 7అదోనీయా సెరూయా కొడుకు యోవాబుతో, యాజకుడు అబ్యాతారుతో సమాలోచన చేశాడు. వారు అతని పక్షాన చేరి అతనికి సహాయం చేశారు. 8అయితే యాజకుడు సాదోకు, యెహోయాదా కొడుకు బెనాయా, ప్రవక్త నాతాను, షిమీ, రేయీ, దావీదు అంగరక్షకులు అదోనీయాతో చేరలేదు. 9అదోనీయా ఏన్‌రోగేలు దగ్గరలోని జోహెలేతు అనే బండ దగ్గర గొర్రెలనూ ఎడ్లనూ కొవ్విన దూడలనూ బలిగా అర్పించి, రాకుమారులైన తన సోదరులందరినీ, యూదావారైన రాజు సేవకులందరినీ పిలిపించాడు. 10అయితే అతడు నాతాను ప్రవక్తనూ బెనాయానూ దావీదు శూరులనూ తన సోదరుడు సొలొమోనునూ పిలవలేదు.
11అప్పుడు నాతాను సొలొమోను తల్లి బత్షెబతో ఇలా చెప్పాడు. “హగ్గీతు కొడుకు అదోనీయా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడన్న సంగతి నీకు వినబడలేదా? కాని ఈ సంగతి మన యజమాని అయిన దావీదుకు తెలియదు. 12కాబట్టి నీ ప్రాణాన్ని, నీ కొడుకు సొలొమోను ప్రాణాన్ని రక్షించుకోడానికి నేను నీకొక ఆలోచన చెబుతాను విను. 13నీవు దావీదు రాజు దగ్గరకి వెళ్ళి, ‘నా యేలినవాడా, రాజా, నీ కొడుకు సొలొమోను నా తరువాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడని నీ సేవకురాలినైన నాకు నీవు ప్రమాణం చేశావే, మరి ఇదేంటి, అదోనీయా ఏలుతున్నాడు?’ అని అడుగు. 14రాజుతో నీవు మాట్లాడుతుండగా నేను నీ వెనకాలే లోపలికి వచ్చి నీ మాటలను బలపరుస్తాను.”
15కాబట్టి బత్షెబ గదిలో ఉన్న రాజు దగ్గరికి వచ్చింది. చాలా ముసలివాడైన రాజుకి షూనేమీయురాలు అబీషగు పరిచర్య చేస్తూ ఉంది. 16బత్షెబ వచ్చి రాజు ముందు సాగిలపడి నమస్కారం చేసింది. రాజు “నీకేమి కావాలి?” అని అడిగాడు. అందుకు ఆమె ఇలా మనవి చేసింది. 17“నా యేలిన వాడా, నీవు ‘నా దేవుడైన యెహోవా తోడు, నిశ్చయంగా నీ కొడుకు సొలొమోను నా తరవాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడు’ అని నీ సేవకురాలినైన నాకు ప్రమాణం చేశావు. 18కానీ ఇప్పుడు అదోనీయా పరిపాలిస్తున్నాడు. ఈ సంగతి నా యజమానివీ, రాజువీ అయిన నీకు ఇప్పటి వరకూ తెలియలేదు. 19అతడు ఎడ్లనూ కొవ్విన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ, యాజకుడు అబ్యాతారునూ సైన్యాధిపతి యోవాబునూ ఆహ్వానించాడు గానీ నీ సేవకుడు సొలొమోనుని ఆహ్వానించలేదు. 20నా యజమానీ, నా రాజా, నీ తరవాత ఎవరు సింహాసనం అధిష్టిస్తారో అని ఇశ్రాయేలీయులంతా కనిపెట్టి చూస్తున్నారు. 21అంతేగాక, నా యేలినవాడివీ, రాజువూ అయిన నీవు నీ పూర్వికులతో కూడ కన్ను మూసిన తరవాత నన్నూ నా కొడుకు సొలొమోనునూ వారు రాజద్రోహులుగా ఎంచుతారు.”
22ఆమె రాజుతో మాటలాడుతూ ఉండగానే నాతాను ప్రవక్త లోపలికి వచ్చాడు. “నాతాను ప్రవక్త వచ్చాడు” అని సేవకులు రాజుకు తెలియజేశారు. 23అతడు రాజు ఎదుటకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. 24అతడు “నా యజమానీ, రాజా! అదోనీయా నీ తరవాత నీ సింహాసనమెక్కి రాజ్యాన్ని పాలిస్తాడని నీవు చెప్పావా? 25ఎందుకంటే, ఈ రోజు అతడు అసంఖ్యాకంగా ఎద్దులనూ కొవ్విన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ సైన్యాధిపతులనూ యాజకుడు అబ్యాతారునూ పిలిచాడు. వారంతా అతని దగ్గర ఉండి అన్నపానాలు తీసుకుంటూ, ‘రాజైన అదోనీయా చిరంజీవి అవుతాడు గాక’ అని పలుకుతున్నారు. 26అయితే నీ సేవకుడినైన నన్నూ యాజకుడు సాదోకునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నీ సేవకుడు సొలొమోనునూ అతడు పిలవలేదు. 27నా యజమాని రాజు తన తరువాత సింహాసనం మీద ఎవరు ఆసీనుడౌతాడో తన సేవకులతో చెప్పకుండానే ఇలా చేసాడా” అని అడిగాడు.
సొలొమోను రాజుగా అభిషిక్తుడు కావడం
28దావీదు “బత్షెబను పిలవండి” అని ఆజ్ఞాపించాడు. ఆమె రాజు సన్నిధికి తిరిగి వచ్చి రాజు ఎదుట నిలబడింది. 29అప్పుడు రాజు ప్రమాణ పూర్వకంగా “అన్ని రకాల సమస్యల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, 30‘తప్పకుండా నీ కొడుకైన సొలొమోను నా తరవాత నాకు బదులుగా నా సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలిస్తాడని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామం తోడు’ అని నేను నీకు మునుపు ప్రమాణం చేసిన దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను” అని చెప్పాడు. 31అప్పుడు బత్షెబ సాష్టాంగపడి రాజుకు నమస్కారం చేసి “నా యజమాని, రాజు అయిన దావీదు చిరకాలం జీవిస్తాడు గాక” అంది.
32అప్పుడు రాజైన దావీదు “యాజకుడు సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నా దగ్గరికి పిలవండి” అని ఆజ్ఞాపించాడు. వారు రాజు ఎదుటికి వచ్చారు. 33రాజు “మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకు వెళ్ళి నా కొడుకు సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకు వెళ్ళండి. 34యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరవాత మీరు బాకాలు ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి’ అని ప్రకటన చేయాలి. 35తరువాత, ఇశ్రాయేలు వారి మీదా యూదా వారి మీదా నేను అతణ్ణి అధికారిగా నియమించాను. కాబట్టి మీరు యెరూషలేముకు అతని వెంట రావాలి. అతడు నా సింహాసనం మీద కూర్చుని నా స్థానంలో రాజవుతాడు” అని ఆజ్ఞాపించాడు.
36అందుకు యెహోయాదా కుమారుడు బెనాయా రాజుకు ఈ విధంగా జవాబిచ్చాడు. “ఆ విధంగానే జరుగుతుంది గాక, నా యజమానివీ రాజువీ అయిన నీ దేవుడు యెహోవా ఆ మాటను స్థిరపరుస్తాడు గాక. 37యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు సొలొమోనుకు కూడా తోడుగా ఉండి, నా యజమానివీ రాజువీ అయిన నీ రాజ్యం కంటే అతని రాజ్యాన్ని ఘనమైనదిగా చేస్తాడు గాక.” 38కాబట్టి యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గిహోనుకు తీసుకు వచ్చారు. 39సాదోకు గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా ప్రజలంతా “రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి” అని కేకలు వేశారు. 40ప్రజలంతా అతని వెంట వచ్చి వేణువులు ఊదుతూ, వాటి స్వరం చేత నేల అదిరిపోయేటంతగా అమితంగా సంతోషించారు.
41అదోనీయా, అతనితో ఉన్న అతిథులూ విందు ముగిస్తూ ఉండగా ఆ కోలాహలం వారికి వినబడింది. యోవాబు ఆ బాకానాదం విని “పట్టణంలో ఈ సందడి ఏమిటి?” అని అడిగాడు. 42అంతలో, యాజకుడు అబ్యాతారు కొడుకు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా “లోపలికి రా, నీవు యోగ్యుడివి. మంచి వార్తతో వస్తావు” అన్నాడు. 43అప్పుడు యోనాతాను అదోనీయాతో “మన యజమాని, రాజు అయిన దావీదు సొలొమోనును రాజుగా నియమించాడు. 44రాజు యాజకుడైన సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ కెరేతీయులనూ పెలేతీయులనూ అతనితో పంపాడు. వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించారు. 45యాజకుడైన సాదోకూ ప్రవక్త నాతానూ గిహోనులో అతనికి పట్టాభిషేకం చేశారు. అక్కడి నుండి వారు సంతోషంగా తిరిగి వచ్చారు. అందువలన పట్టణం కోలాహలంగా ఉంది. మీకు వినబడిన శబ్దం అదే.
46అంతేగాక సొలొమోను సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. 47పైగా రాజు సేవకులు తమ యజమాని, రాజు అయిన దావీదుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చారు. ‘దేవుడు నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలిగేలా, నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేలా చేస్తాడు గాక’ అని చెప్పారు. అప్పుడు రాజు మంచం మీదే సాష్టాంగపడి నమస్కారం చేసి 48‘నేను బతికి ఉండగానే ఈ రోజు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా సింహాసనం మీద కూర్చోడానికి నాకు ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను కళ్లారా చూశాను. ఆయనకు స్తుతి కలుగు గాక’ అన్నాడు” అని యోనాతాను చెప్పాడు.
49అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి, తమ ఇళ్ళకి వెళ్లిపోయారు. 50అదోనీయా సొలొమోనుకు భయపడి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. 51అదోనీయా బలిపీఠం కొమ్ములు పట్టుకుని “రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తితో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి” అని వేడుకుంటున్నాడని సొలొమోనుకు వార్త వచ్చింది. 52అందుకు సొలొమోను “అతడు తనను నిర్దోషిగా కనపరచుకోగలిగితే అతని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. కాని అతడు దోషి అని తేలితే అతనికి మరణశిక్ష తప్పదు” అని చెప్పి, 53బలిపీఠం దగ్గర నుండి అతణ్ణి పిలిపించాడు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడినపుడు సొలొమోను అతనితో “ఇక నీ ఇంటికి వెళ్ళు” అన్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 1: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి