2 దిన 6

6
1అప్పుడు సొలొమోను “గాఢాంధకారంలో నేను నివసిస్తున్నాను అని యెహోవా సెలవిచ్చాడు. 2అయితే నువ్వు ఎల్లకాలం నివసించడానికి నిత్యమైన స్థలంగా నేనొక గొప్ప మందిరాన్ని నీ కోసం కట్టించాను” అన్నాడు. 3తరువాత రాజు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజం అంతా నిలబడి ఉండగా వారిని దీవించాడు.
4అతడు వారితో “నా తండ్రి దావీదుకు ప్రమాణం చేసి, దాన్ని స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తోత్రం కలుగు గాక. 5ఆయన ‘నేను నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన రోజు మొదలు నా నామం నిలిచి ఉండడానికి ఒక మందిరం కట్టించాలని నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఏ పట్టణాన్నీ ఏర్పాటు చేసుకోలేదు, ఇశ్రాయేలీయులనే నా ప్రజల మీద అధిపతిగా ఉండడానికి ఏ మనిషినీ నియమించ లేదు. 6ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమునూ, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదునూ ఎన్నుకున్నాను’ అని చెప్పాడు.
7ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలన్నది నా తండ్రి దావీదు హృదయ వాంఛ. 8అయితే యెహోవా నా తండ్రితో ‘నా నామ ఘనత కోసం మందిరం కట్టాలన్న నీ ఉద్దేశం మంచిది. 9కానీ నువ్వు ఆ మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. నీకు పుట్టబోయే కుమారుడు నా నామానికి ఆ మందిరం కడతాడు’ అని చెప్పాడు.
10యెహోవా అప్పుడు చెప్పిన తన మాటను ఇప్పుడు నెరవేర్చాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి దావీదు స్థానంలో రాజునై సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు మందిరం కట్టించాను. 11ఇశ్రాయేలీయులతో యెహోవా చేసిన నిబంధనకు గుర్తుగా ఉన్న మందసాన్ని దానిలో ఉంచాను” అని చెప్పాడు.
సొలొమోను ప్రతిష్ట ప్రార్థన
6:12-40; 1రాజులు 8:22-53
6:41-42; కీర్త 132:8-10
12తరవాత ఇశ్రాయేలీయులంతా సమావేశమై చూస్తుండగా యెహోవా బలిపీఠం ముందు నిలబడి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు.
13సొలొమోను తాను చేయించిన ఐదు మూరల పొడవు, ఐదు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు ఉన్న ఇత్తడి వేదికను ఆవరణంలో పెట్టించాడు. దాని మీద నిలబడి, సమావేశమైన ఇశ్రాయేలీయులందరి ఎదుటా మోకరించి, ఆకాశం వైపు చేతులు చాపి ఇలా ప్రార్థించాడు.
14“యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయ పూర్వకంగా నిన్ను అనుసరించే నీ భక్తుల పట్ల నీ నిబంధనను నెరవేరుస్తూ కృప చూపే నీలాంటి దేవుడు ఆకాశాల్లో గానీ, భూమి మీద గానీ లేడు. 15నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో నువ్వు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నావు. నువ్వు ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చావు. ఈ రోజు మేము దాన్ని కళ్ళారా చూస్తున్నాము. 16‘నువ్వు నడుచుకున్నట్టు నీ కుమారులు కూడా ప్రవర్తించి, నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుని పాలించేవాడు నా సన్నిధిలో నీకుండకుండా పోడు’ అని నీవు నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నెరవేర్చు.
17యెహోవా, నువ్వు నీ సేవకుడు దావీదుకిచ్చిన వాగ్దానం ఇప్పుడు స్థిరపడుతుంది గాక. 18దేవుడు మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తాడా? ఆకాశ మహాకాశాలు నీకు సరిపోవే? నేను కట్టిన ఈ మందిరం సరిపోతుందా? 19దేవా, యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిలో చేసే ఈ ప్రార్థననూ విన్నపాన్నీ మన్నించు. నీ సేవకుడిని, నేను చేసే ప్రార్థననూ, నా మొర్రనూ ఆలకించు. 20నీ సేవకులు ఈ స్థలం లో చేసే విన్నపాలు వినడానికి, ‘నా నామాన్ని అక్కడ ఉంచుతాను’ అని నువ్వు వాగ్దానం చేసిన స్థలం లో ఉన్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి దివారాత్రులు నిలుస్తుంది గాక. 21నీ సేవకుడు, నీ ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిరం వైపుకు తిరిగి చేయబోయే ప్రార్థనలు ఆలకించు, అవును, నువ్వు నివసిస్తున్న పరలోకం నుండి ఆలకించి, వారి పాపాలను క్షమించు.
22ఎవరైనా తన పొరుగువాడి పట్ల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించడానికి ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు, 23నువ్వు పరలోకం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చు. హాని చేసినవాడి తలపైకి శిక్ష రప్పించు. నీతిపరుని నీతి చొప్పున వాడికి దయచేసి, అతని నీతిని స్థిరపరచు.
24నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ ఎదుట పాపం చేయడం వలన తమ శత్రువులను ఎదిరించి నిలవలేక నీ దగ్గరకి తిరిగి వచ్చి నీ నామాన్ని ఒప్పుకుని, ఈ మందిరంలో నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకున్నప్పుడు, 25పరలోకం నుండి నువ్వు విని, నీ ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశానికి వారిని మళ్లీ రప్పించు.
26వారు నీ దృష్టికి పాపం చేయడం వలన ఆకాశం మూసుకు పోయి వర్షం కురవనప్పుడు, వారు ఈ స్థలం లో ప్రార్థన చేసి నీ నామాన్ని ఒప్పుకుని, నువ్వు కలిగించిన బాధలో వారు తమ పాపాలను విడిచిపెట్టి తిరిగితే 27పరలోకంలో ఉన్న నువ్వు ఆలకించి, నీ సేవకులు, నీ ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడవాల్సిన మంచి మార్గం వారికి బోధించి, నువ్వు నీ ప్రజలకి స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశంలో వర్షం కురిపించు.
28దేశంలో కరువు, తెగులు కనబడినప్పుడూ అగ్గి తెగులు, బూజు, తగిలినప్పుడూ మిడతలు, చీడపురుగులు దాడి చేసినప్పుడూ, లేదా శత్రువులు ఇశ్రాయేలు ప్రజల పట్టణాలను ముట్టడించినప్పుడూ అరిష్టం, వ్యాధి సోకినప్పుడూ 29ఏ ఒక్కడు గానీ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులంతా గానీ హృదయంలో బాధ, కష్టం అనుభవిస్తూ ఉండి, ఈ మందిరం వైపు చేతులు చాపి చేసే విజ్ఞాపనలూ ప్రార్థనలూ నీ నివాస స్థలమైన పరలోకం నుండి నువ్వు ఆలకించి వారిని క్షమించు.
30మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ దేశంలో వారు తమ జీవితకాలమంతా నీపట్ల భయభక్తులు కలిగి 31నీ మార్గాల్లో నడిచేలా వారి హృదయాలను ఎరిగిన నువ్వు వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దయచెయ్యి. ఎందుకంటే నీవొక్కడివే మానవుని హృదయాన్ని ఎరిగిన వాడివి.
32ఇశ్రాయేలీయులనే నీ ప్రజలకు సంబంధం లేని అన్యులు నీ గొప్ప నామం గూర్చీ నీ బాహుబలం గూర్చీ చాచిన నీ చేతులను గూర్చీ విని, దూరదేశం నుండి ఈ మందిరానికి వచ్చి వేడుకుంటే, 33నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి ప్రార్థన అంగీకరించి, ఆ అన్యులు నిన్ను అడిగిన దాన్ని వారికి అనుగ్రహించు. తద్వారా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్టుగా ఈ భూప్రజలంతా నీ నామాన్ని తెలుసుకుని, నీలో భయభక్తులు కలిగి, నేను కట్టిన ఈ మందిరానికి నీ నామం పెట్టావని గ్రహిస్తారు.
34నీ ప్రజలు నువ్వు పంపిన మార్గంలో తమ శత్రువులతో యుద్ధానికి బయలుదేరి, నువ్వు ఏర్పరచుకున్న ఈ పట్టణం వైపూ నీ నామానికి నేను కట్టించిన ఈ మందిరం వైపూ చూసి వేడుకున్నప్పుడు, 35పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననూ ఆలకించి వారి పనుల్లో వారికి సహాయం చెయ్యి.
36పాపం చేయని వాడెవడూ లేడు కాబట్టి వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నువ్వు వారి మీద ఆగ్రహించి, శత్రువుల చేతికి వారిని అప్పగిస్తే, ఆ శత్రువులు వారిని దూరంగా లేక దగ్గరగా ఉన్న తమ దేశాలకు పట్టుకు పోయినప్పుడు, 37వారు చెరగా వెళ్ళిన ఆ దేశంలో బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాప పడి ‘మేము పాపం చేసి, దోషులమయ్యాం, మేము భక్తిహీనంగా నడిచాం’ అని ఒప్పుకుని 38తాము చెరలో ఉన్న దేశంలో తమ పూర్ణహృదయంతో పూర్ణాత్మతో నీవైపు తిరిగి, తమ పూర్వీకులకు నీవిచ్చిన తమ దేశం వైపూ నువ్వు కోరుకున్న ఈ పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ మనస్సు తిప్పి వేడుకుంటే 39నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననీ ఆలకించి, వారి పని జరిగించి, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలను క్షమించు.
40నా దేవా, ఈ స్థలం లో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు. దాన్ని నీ చెవులు ఆలకించనీ. 41నా దేవా, యెహోవా, శక్తికి ఆధారభూతమైన నీ మందసంతో సహా లేచి రా. నీ విశ్రాంతి స్థలం లో ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ వస్త్రాలు ధరించుకుంటారు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు గాక. 42దేవా యెహోవా, నీ చేత అభిషేకం పొందిన వాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. నీ భక్తుడు దావీదుకు నువ్వు వాగ్దానం చేసిన కృపలను మరచిపోవద్దు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దిన 6: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి