2 రాజులు 10
10
అహాబు కుమారులు మరణం
1అహాబుకి షోమ్రోనులో డెబ్భై మంది సంతానం ఉన్నారు. యెహూ షోమ్రోనులో ఉన్న యెజ్రెయేలు అధిపతులకూ, అక్కడి పెద్దలకూ, అహాబు సంతానం సంరక్షకులకూ ఉత్తరాలు రాసి పంపాడు. 2ఆ ఉత్తరంలో ఇలా రాశాడు “మీ యజమాని వారసులు మీ దగ్గరే ఉన్నారు. మీ దగ్గర రథాలూ, గుర్రాలూ, ఆయుధాలూ ఉన్నాయి. అలాగే మీరు బలమైన ప్రాకారాలున్న పట్టణంలో ఉన్నారు. 3కాబట్టి ఈ ఉత్తరం మీకు అందిన వెంటనే మీ యజమాని వారసుల్లో శ్రేష్ఠమైన వాణ్ణీ, యోగ్యుణ్ణీ ఎంపిక చేసి అతణ్ణి తన తండ్రి సింహాసనంపై కూర్చోబెట్టండి. మీ యజమాని రాజ వంశం కోసం యుద్ధం చేయండి.”
4కానీ వారు చాలా భయపడిపోయారు. “ఇద్దరు రాజులు యెహూ ఎదుట నిలవలేక పోయారు. మనమెట్లా నిలవగలం?” అని చెప్పుకున్నారు. 5అప్పుడు ఆ కుటుంబం బాధ్యతలు చూస్తున్న వ్యక్తీ, పట్టణం బాధ్యతలు చూస్తున్న వ్యక్తీ, పెద్దలూ, ఆ పిల్లలను పెంచిన వాళ్ళూ కలసి యెహూకి “మేము మీ సేవకులం. మీ ఆదేశాల ప్రకారమే అన్నీ చేస్తాం. మేము ఎవర్నీ రాజుగా చేసుకోం. మీకేది మంచిగా తోస్తే అదే చేయండి” అని జవాబు పంపారు.
6అప్పుడు యెహూ రెండోసారి వాళ్లకు ఉత్తరం రాశాడు. దానిలో “మీరు నా వైపు ఉండి నా మాట వింటే మీ యజమాని వారసుల తలలు నరికి వాటితో రేపటికల్లా యెజ్రెయేలులో నా దగ్గరికి రండి” అని రాశాడు. రాకుమారులు మొత్తం డెబ్భై మంది ఆ పట్టణం పెద్దల సంరక్షణలో ఉన్నారు. 7కాబట్టి ఆ ఉత్తరం అందిన తరువాత వారు ఆ డెబ్భైమందినీ పట్టుకుని చంపేశారు. వాళ్ళ తలలను బుట్టల్లో ఉంచి యెజ్రెయేలులో ఉన్న యెహూ దగ్గరికి పంపించారు.
8ఒక వార్తాహరుడు యెహూ దగ్గరికి వచ్చి “వారు రాకుమారుల తలలు తీసుకు వచ్చారు” అని చెప్పాడు. అతడు “వాటిని ఉదయం వరకూ పట్టణ ద్వారం దగ్గర రెండు కుప్పలుగా వేయండి” అన్నాడు. 9ఉదయం అతడు బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న మనుషులను చూసి “మీరంతా నిర్దోషులు. నేను నా రాజు పై కుట్ర చేసి అతణ్ణి చంపేశాను. అయితే వీళ్ళనెవరు చంపారు? 10తన సేవకుడు ఏలీయా ద్వారా యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటలను ఆయన నెరవేర్చాడు. యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటల్లో ఏ ఒక్కటీ వ్యర్థంగా పోదని మీరు తెలుసుకోవాలి.” 11ఈ విధంగా యెహూ యెజ్రెయేలులో ఉన్న అహాబు కుటుంబ సభ్యులందర్నీ, అతనితో సంబంధం ఉన్న ప్రముఖమైన వ్యక్తులనూ, అతనికి సన్నిహితమైన స్నేహితులనూ, అతని పూజారులు అందర్నీ చంపివేశాడు. అలాంటి వారు ఇక ఒక్కరు కూడా లేకుండా చేశాడు.
12ఇది జరిగాక అతడు షోమ్రోను పట్టణానికి ప్రయాణమయ్యాడు. దారిలో అతడు గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు 13యూదా రాజు అహజ్యా అన్నదమ్ములు ఎదురయ్యారు. యెహూ వాళ్ళను “మీరు ఎవరు?” అని అడిగాడు. వారు “మేము అహజ్యా అన్నదమ్ములం. మేము రాజు గారి పిల్లలనూ, రాణి యెజెబెలు పిల్లలనూ పలకరించడానికి వెళ్తున్నాం” అని చెప్పారు. 14అతడు “వాళ్ళను ప్రాణాలతో పట్టుకోండి” అని తన వాళ్ళను ఆదేశించాడు. దాంతో వారు అందర్నీ సజీవంగా పట్టుకుని నలభై రెండు మందిని గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గర చంపారు. వాళ్ళలో ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలిపెట్టలేదు.
15అక్కడనుండి యెహూ ముందుకు వెళ్ళాడు. తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కొడుకు యెహోనాదాబుని చూశాడు. అతనితో మంచీ చెడూ మాట్లాడి “నా హృదయం నీ విషయంలో నిజాయితీగా ఉన్నట్టు నీ హృదయం నా విషయంలో ఉందా?” అని అడిగాడు. దానికి యెహోనాదాబు “ఉంది” అన్నాడు. యెహూ “ఆలాగైతే నా చేతిలో నీ చెయ్యి వేయి” అన్నాడు. యెహోనాదాబు యెహూ చేతిలో తన చెయ్యి వేశాడు. యెహూ అతణ్ణి తన రథం మీద ఎక్కించుకున్నాడు. 16యెహూ అతనితో “యెహోవా కోసం నాకు ఎంత ఉత్సాహం ఉందో చూద్దువుగాని రా” అన్నాడు. తన రథంలో అతణ్ణి కూర్చోబెట్టాడు. 17అతడు షోమ్రోను చేరుకుని అక్కడ అహాబుకు చెందిన మిగిలిన రాజవంశీకులందర్నీ చంపివేశాడు. యెహోవా ఏలీయాకు చెప్పిన మాట నెరవేర్చాడు.
బయలు దేవుత భక్తులు వధ
18ఆ తరువాత యెహూ ప్రజలందర్నీ సమకూర్చాడు. వారితో “అహాబు బయలు దేవుతకి స్వల్పంగానే సేవ చేసాడు. కాని యెహూ ఎంతో గొప్ప సేవ చేయబోతున్నాడు. 19కాబట్టి బయలు దేవుడి ప్రవక్తలందర్నీ, ఆరాధకులందర్నీ, పూజారులందర్నీ నా దగ్గరికి పిలుచుకు రండి. బయలు దేవుడికి ఒక మహా బలి చేయబోతున్నాను. కాబట్టి ఎవరూ రాకుండా ఉండిపోకూడదు. అలా రాని వాణ్ణి నేను బతకనివ్వను” అన్నాడు. బయలు ఆరాధకులందర్నీ చంపాలనే ఉద్దేశ్యంతో యెహూ ఈ మోసపూరితమైన ప్రకటన చేశాడు. 20ఇంకా యెహూ “బయలు దేవుడికి ఒక ప్రత్యేకమైన పండగ జరుగబోతున్నదని ప్రకటించండి” అన్నాడు. అతని సేవకులు ఆ విధంగానే ప్రకటించారు.
21యెహూ ఇశ్రాయేలు దేశం అన్ని ప్రాంతాల్లో ఈ ప్రకటన చేయించాడు. బయలు ఆరాధకులందరూ తరలి వచ్చారు. అక్కడకు రానివాడు అంటూ ఎవడూ లేడు. వాళ్ళంతా బయలు గుడిలో ప్రవేశించారు. ఆ పక్క నుండి ఈ పక్క వరకూ ఎక్కడా ఖాళీ లేకుండా గుడి కిక్కిరిసి పోయింది. 22అక్కడ పూజారుల దుస్తులను దాచే అధికారిని యెహూ పిలిపించి “బయలు ఆరాధకులందరికీ ప్రత్యేక దుస్తులు తీసుకు రా” అని చెప్పాడు. అతడు ఆ దుస్తులను బయటకు తీసి తెప్పించాడు.
23తరువాత యెహూ, రేకాబు కొడుకు యెహోనాదాబూ బయలు దేవుడి గుడిలో ప్రవేశించారు. అప్పుడు యెహూ “బాగా వెదకండి. బయలు దేవుడి ఆరాధకులు తప్ప ఇక్కడ యెహోవా సేవకులు ఎవరూ ఉండకుండాా జాగ్రత పడండి” అంటూ బయలు దేవుడి ఆరాధకులను ఆదేశించాడు. 24అప్పుడు వాళ్ళంతా అర్పణలూ, దహనబలులూ చెల్లించడానికి లోపలి వెళ్ళారు. యెహూ తన మనుషుల్లో ఎనభై మందిని ఎంపిక చేసి వాళ్ళను బయట నిలబెట్టాడు. వాళ్ళతో “నేను మీ చేతికప్పగించిన వాళ్ళను ఎవర్నీ తప్పించుకు పోనివ్వద్దు. అలా ఎవడైనా తప్పించుకుంటే వాడి ప్రాణానికి బదులుగా వాడు తప్పించుకోడానికి కారణమైన వాడి ప్రాణం తీసుకుంటాను” అని చెప్పాడు.
25దహనబలులు అర్పించడం ముగిసిన తరువాత యెహూ అక్కడి కాపలా వాళ్ళతోనూ, అధికారులతోనూ “లోపలికి వెళ్లి అందర్నీ చంపేయండి. ఏ ఒక్కడూ బయటకు రావడానికి వీల్లేదు” అన్నాడు. వారు కత్తులతో అందర్నీ హతమార్చారు. కాపలా వాళ్ళూ, అధికారులూ వాళ్ళను బయటకు విసిరేసి బయలు దేవుడి గర్భగుడి లోకి వెళ్ళారు. 26అక్కడ పవిత్రంగా ఎంచే బయలు దేవుడి స్తంభాలను బయటకు లాక్కొచ్చి తగలబెట్టారు. 27వారు బయలు దేవుడి విగ్రహాన్ని పగలగొట్టి గుడిని ధ్వంసం చేశారు. ఆ గుడిని చెత్తకుప్పలా చేశారు. అది ఈ రోజు వరకూ అలాగే ఉంది. 28ఈ విధంగా యెహూ బయలు దేవుణ్ణి ఇశ్రాయేలులో లేకుండా నాశనం చేశాడు.
29కానీ బేతేలు, దాను అనే స్థలాల్లో బంగారు దూడలను ప్రతిష్టించి, వాటిని పూజించడానికి ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము వలె యెహూ కూడా ఆ బంగారు దూడలను పూజించడం మానలేదు. 30కాబట్టి యెహోవా యెహూతో “అహాబు కుటుంబం విషయంలో నీవు నా హృదయంలో ఉన్నదే చేసి నా దృష్టికి న్యాయమైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకూ ఇశ్రాయేలును పరిపాలిస్తారు” అని చెప్పాడు. 31అయితే యెహూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం పూర్ణ హృదయంతో జీవించడంలో ఎలాటి శ్రద్ధా చూపించలేదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన యరోబాము చేసిన పాపాలను వదిలి పెట్టలేదు.
32ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని తగ్గించడం మొదలుపెట్టాడు. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో యొర్దాను నదికి తూర్పుగా ఉన్న ప్రాంతంలో వాళ్ళను ఓడించాడు. 33గిలాదు ప్రాంతం, అర్నోను లోయలోని అరోయేరు నుండి గాదు, రూబేను, మనష్షె గోత్రాల ప్రజలు నివసించిన గిలాదు, బాషాను ప్రాంతాల్లో వాళ్ళను హజాయేలు ఓడించాడు.
34యెహూ చేసిన మిగిలిన పనులూ, అతణ్ణి గూర్చిన మిగతా విషయాలూ, అతని శూరత్వం గూర్చిన విషయాలూ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంచారు. 35తరువాత యెహూ తన పూర్వీకులతో నిద్రించాడు. అతణ్ణి షోమ్రోనులో సమాధి చేశారు. అతని కొడుకు యెహోయాహాజు అతని స్థానంలో రాజు అయ్యాడు. 36యెహూ షోమ్రోనులో ఇశ్రాయేలును ఇరవై ఎనిమిదేళ్ళు పరిపాలించాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 10: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.