2 రాజులు 9
9
ఇశ్రాయేలు రాజుగా యెహూ అభిషేకం
1ఆ తరువాత ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల సమాజం నుండి ఒక వ్యక్తిని పిలిచాడు. అతనితో “ప్రయాణానికి బట్టలు ధరించు. ఈ చిన్న నూనె సీసా పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్ళు. 2అక్కడకు చేరుకున్న తరువాత నింషీ మనవడూ, యెహోషాపాతు కొడుకూ అయిన యెహూ కోసం వాకబు చెయ్యి. అతణ్ణి కలుసుకో. అతణ్ణి తన సహచరులనుండి వేరు చేసి లోపలి గదిలో ఏకాంతమైన చోటికి తీసుకు వెళ్ళు. 3నూనె సీసా తీసి అతని తలపై నూనె పోసి ‘ఇశ్రాయేలు రాజుగా నేను నిన్ను అభిషేకం చేసానని యెహోవా చెప్తున్నాడు’ అని అతనితో చెప్పు. తరువాత తలుపు తీసి ఆలస్యం చేయకుండా అక్కడ్నించి పారిపో” అని చెప్పాడు.
4కాబట్టి ప్రవక్త అయిన ఆ యువకుడు రామోత్గిలాదుకి ప్రయాణమయ్యాడు. అతడు చేరుకునేసరికి అక్కడ సేనా నాయకులు కూర్చుని ఉన్నారు. 5అప్పుడు ఆ యువకుడు “నాయకా, నేను నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను” అన్నాడు. దానికి యెహూ “ఇంతమందిమి ఉన్నాం. ఆ మాట ఎవరిని గూర్చి?” అన్నాడు. యువకుడైన ఆ ప్రవక్త “నాయకా, ఆ మాట నీ కోసమే” అన్నాడు. 6కాబట్టి యెహూ లేచి ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ప్రవక్త అతని తలపై నూనె పోశాడు. యెహూతో “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు పైనా దేవుని ప్రజల పైనా నిన్ను రాజుగా అభిషేకించాను.
7నా సేవకులైన ప్రవక్తలనూ, యెహోవా ఇతర సేవకులనూ యెజెబెలు చంపించింది. వారు కార్చిన రక్తానికి నేను ప్రతీకారం తీర్చుకునేలా నీవు నీ రాజు అయిన అహాబు కుటుంబాన్ని అంతం చేయాలి. 8అహాబు సంతానం అందరూ నశిస్తారు. వాడు దాసుడైనా స్వతంత్రుడైనా అహాబు సంతానంలో ప్రతి మగవాడినీ నేను సమూలనాశనం చేస్తాను.
9నెబాతు కొడుకు యరొబాము కుటుంబంలా, అహీయా కొడుకు బయెషా కుటుంబంలా అహాబు కుటుంబాన్ని చేస్తాను. 10యెజ్రెయేలులో యెజెబెలును కుక్కలు పీక్కు తింటాయి. ఆమెను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు.” ఈ మాటలు చెప్పి ఆ ప్రవక్త తలుపు తీసుకుని పారిపోయాడు.
11అప్పుడు యెహూ బయటకు తన తోటి రాజ సేవకుల దగ్గరికి వచ్చాడు. వారిలో ఒకడు “అంతా కుశలమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. దానికి యెహూ “వాడూ, వాడి మాటలూ మీకు తెలుసు కదా” అన్నాడు. 12అప్పుడు వారు “మాకు తెలియదు. చెప్పు” అన్నారు. అప్పుడు యెహూ “అతడు నాతో అదీ ఇదీ మాట్లాడాడు. ఆ తరువాత అతనింకా ‘యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేశాను’ అన్నాడు” అని చెప్పాడు. 13వెంటనే వారు తమ బట్టలు తీసి యెహూ దిగుతున్న మెట్ల మీద పరిచారు. భేరీలు ఊది “యెహూ రాజయ్యాడు” అని ప్రకటించారు.
యెహూ, యెహోరాము, అహజ్యాను చంపడం
14నింషీ కొడుకు యెహూ ఈ విధంగా యెహోషాపాతు కొడుకు యెహోరాముపై కుట్ర చేశాడు. ఆ సమయంలో యెహోరామూ, ఇశ్రాయేలు వాళ్ళంతా రామోత్గిలాదును సిరియా రాజు హజాయేలు నుండి రక్షించడానికి అక్కడే ఉన్నాడు. 15కానీ యెహోరాము సిరియా రాజు హజాయేలుతో చేస్తున్న యుద్ధంలో సిరియా సైన్యం చేసిన గాయాలను బాగు చేసుకోడానికి యెజ్రెయేలుకి తిరిగి వచ్చాడు.
అప్పుడు యెహూ రాజు సేవకులతో “ఇదే మీ అభిప్రాయమైతే యెజ్రెయేలుకి ఈ వార్త వెళ్ళడానికి వీలు లేదు. ఈ పట్టణం విడిచి ఎవరూ తప్పించుకుని వెళ్ళకుండా చూడండి” అని చెప్పాడు. 16అక్కడనుండి యెహూ రథంపై యెజ్రెయేలుకి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడే యెహోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో యూదా రాజు అహజ్యా యెహోరామును కలుసుకోడానికి అక్కడికి వచ్చాడు.
17యెజ్రెయేలు ప్రాకారం మీద ఒక కాపలా వాడు కావలి కాస్తున్నాడు. వాడు ప్రాకారం పైనుండి కొంత దూరంలో వస్తున్న యెహూనూ అతనితో వస్తున్న సైనిక దళాన్నీ చూసి “ఒక సైనిక దళం రావడం నాకు కనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు యెహోరాము “ఒక గుర్రపు రౌతును పిలవండి. ఆ వచ్చేవాళ్ళను కలుసుకోడానికి అతణ్ణి పంపించండి. అతడు వాళ్ళను ‘శాంతిభావంతో వస్తున్నారా’ అని అడగాలి” అని చెప్పాడు. 18కాబట్టి ఒకడు గుర్రాన్నెక్కి వాళ్ళను కలుసుకోడానికి వెళ్ళి “మీరు శాంతిభావంతో వస్తున్నారా అని రాజు అడుగుతున్నాడు” అన్నాడు. దానికి యెహూ “శాంతిభావం సంగతి నీకెందుకు? వెనక్కు తిరిగి నా వెనకాలే రా” అన్నాడు. కాపలా వారు “వార్తాహరుడు వాళ్ళను కలుసుకున్నాడు గానీ తిరిగి రావడం లేదు” అని రాజుకు తెలియజేశారు.
19అప్పుడు రాజు రెండో అశ్వికుణ్ణి పంపాడు. వాడు వాళ్ళ దగ్గరికి వచ్చి “మీరు శాంతిభావంతో వస్తున్నారా, అని రాజు అడుగుతున్నాడు” అన్నాడు. దానికి యెహూ “శాంతిభావం సంగతి నీకెందుకు? వెనక్కు తిరిగి నా వెనకాలే రా” అన్నాడు. 20మళ్ళీ కావలి వాడు “వీడు కూడా వాళ్ళను కలుసుకుని తిరిగి రావడం లేదు. రథం నడపడం చూస్తే అది నింషీ కొడుకు యెహూ తోలడంలా ఉంది. వెర్రెత్తినట్టు రథం తోలుతున్నాడు” అన్నాడు.
21కాబట్టి యెహోరాము “నా రథాన్ని సిద్ధం చేయండి” అన్నాడు. అతని రథాన్ని సిద్ధం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోరామూ, యూదా రాజు అహజ్యా తమ రథాలపై బయల్దేరి యెహూను కలుసుకోడానికి వెళ్ళారు. యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన భూమి దగ్గర అతణ్ణి ఎదుర్కున్నారు. 22అప్పుడు యెహోరాము యెహూతో “యెహూ, శాంతి భావంతో ఉన్నావా?” అని అడిగాడు. దానికి యెహూ “నీ తల్లి యెజెబెలు వ్యభిచారం, మంత్రవిద్యలు ఇంత మితిమీరిపోయి ఉండగా ఇక శాంతి భావం ఎక్కడది?” అన్నాడు.
23వెంటనే యెహోరాము రథాన్ని మళ్ళించి “అహజ్యా, మోసం, విశ్వాస ఘాతుకం” అని అహజ్యాతో చెప్పి పారిపోయాడు. 24అప్పుడు యెహూ బాణం తీసి తన శక్తి కొద్దీ ఎక్కుపెట్టి యెహోరాము భుజాల మధ్య గురి చూసి కొట్టాడు. ఆ బాణం అతని గుండెల్లోకి దూసుకు వెళ్ళింది. అతడు తన రథంలోనే కుప్పగూలిపోయాడు.
25అప్పుడు యెహూ తన దగ్గర అధికారి బిద్కరుని పిలిచి “అతణ్ణి ఎత్తి యెజ్రెయేలు వాడైన నాబోతు పొలంలో పడవేయి. నీకు గుర్తుందా? మనం ఇద్దరం ఇతని తండ్రి అహాబుతో కలసి గుర్రాలెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనికి వ్యతిరేకంగా ఈ ప్రవచనాన్ని పలికించాడు 26‘యెహోవా చెప్తున్నదేమిటంటే నిన్న నేను నాబోతు రక్తాన్నీ, అతని కొడుకుల రక్తాన్నీ కచ్చితంగా చూశాను. యెహోవాను చెప్తున్నాను. ఇదే నేలపై నేను నీకు ప్రతీకారం చేస్తాను’ కాబట్టి ఇప్పుడు నువ్వు యెహోవా మాట ప్రకారం ఇతణ్ణి ఈ పొలంలో పడవేయి” అన్నాడు.
27జరిగిందంతా చూసిన యూదా రాజు అహజ్యా బేత్ హగ్గాన్ పట్టణం దారిలో తన రథం పై పారిపోయాడు. కానీ యెహూ అతణ్ణి తరిమాడు. “ఆ రథంలోనే అతణ్ణి చంపండి” అంటూ తన సేనానులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఇబ్లెయాముకు సమీపంలో ఉన్న గూరుకు వెళ్ళే దారిలో అతనిపై బాణాలు వేసి కొట్టారు. అహజ్యా తన రథంలోనే మెగిద్దోకు వెళ్ళి అక్కడ చనిపోయాడు. 28అతని సేవకులు అతణ్ణి రథం మీద యెరూషలేముకు తీసుకు వెళ్ళారు. దావీదు నగరంలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి సమాధి చేశారు.
29ఈ అహజ్యా అహాబు కొడుకు యెహోరాము పరిపాలన పదకొండో సంవత్సరంలో యూదాకు రాజు అయ్యాడు.
యెజెబెలు మరణం
30యెహూ యెజ్రెయేలులో అడుగుపెట్టిన విషయం యెజెబెలుకు తెలిసింది. కాబట్టి ఆమె తన కళ్ళ చుట్టూ రంగులు వేసుకుని కేశాలంకరణ చేసుకుని మేడపైని కిటికీలోనుండి బయటకు తొంగి చూసింది. 31యెహూ గుమ్మం గుండా లోపలికి వస్తుండగా “జిమ్రీ వలే యజమానిని చంపినవాడా, శాంతి భావంతో వస్తున్నావా?” అని అడిగింది. 32అతడు తలెత్తి కిటికీ వైపు చూశాడు. “అక్కడ నా వైపు ఉన్నదెవరు?” అని అడిగాడు. ఇద్దరు ముగ్గురు నపుంసకులు కిటికీలోనుండి తొంగి చూసారు.
33యెహూ “ఆమెను కిందకు తోసెయ్యండి” అన్నాడు. వారు యెజెబెలుని కిందకు తోసేశారు. దాంతో ఆమె రక్తం గోడలమీదా, గుర్రాలమీదా చిమ్మింది. అప్పుడు యెహూ ఆమెను గుర్రాలతో తొక్కించాడు. 34తరువాత అతడు భవనంలో ప్రవేశించి భోజనం చేసిన తరువాత “శాపానికి గురైన ఆమె ఒక రాజ కుమార్తె. కాబట్టి వెళ్ళి ఆమెని సమాధి చేయండి” అని ఆదేశించాడు.
35సేవకులు ఆమెని సమాధి చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఆమె పుర్రె, కాళ్ళు, అరచేతులూ తప్ప ఇంకేమీ కనపడలేదు. 36వారు వచ్చి యెహూకి ఆ సంగతి చెప్పారు. అప్పుడు అతడు “ఇది యెహోవా తన సేవకుడూ, తిష్బీ వాడూ అయిన ఏలీయా ద్వారా పలికిన మాట, ‘యెజ్రెయేలు నేలపై కుక్కలు యెజెబెలు మాంసాన్ని తిని వేస్తాయి. 37ఎవరూ గుర్తు పట్టలేకుండా ఆమె శరీరం యెజ్రెయేలు పొలాల్లో పేడలా ఉంటుంది’ ఆ మాట ప్రకారం ఇది జరిగింది” అన్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 9: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.