నిర్గమ 35
35
విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు
1మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవి.
2మొదటి ఆరు రోజులు మీరు పని చెయ్యాలి. ఏడవ రోజు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఆ రోజు పని చేసే ప్రతివాడూ మరణ శిక్షకు పాత్రుడు.
3విశ్రాంతి దినాన మీరు మీ ఇళ్ళలో ఎలాంటి వంటకాలు వండుకోకూడదు.”
సన్నిధి గుడారం నిర్మాణం
నిర్గ 25:1-9
4మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో ఇంకా ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినది ఏమిటంటే, 5మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు, 6నీలం, ఊదా, ఎర్రరంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు, తుమ్మకర్ర, 7దీపాలు వెలిగించడానికి నూనె, 8అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, 9ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, చెక్కిన రత్నాలు తీసుకురావాలి.
10ఇంకా, నైపుణ్యం, జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి. 11ఆ పనులేవంటే, ఆయన నివాసం, నివాస మందిరం ఉండే గుడారం, దాని పైకప్పు, కొలుకులు, పలకలు, అడ్డ కర్రలు, స్తంభాలు, దిమ్మలు. 12మందసం పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణా పీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర, 13సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామగ్రి, సన్నిధి రొట్టెలు, 14వెలుగు కోసం దీప స్థంభం, దాని సామగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలు, దీపాలకు నూనె.
15ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర.
16బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి, గంగాళం, దాని పీట.
17ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు, ప్రవేశ ద్వారానికి తెర.
18నివాస మందిరం కోసం, ఆవరణ కోసం మేకులు, వాటికి తాళ్లు.
19పవిత్ర స్థలం లో సేవ చేయడానికి నేసిన వస్త్రాలు, అంటే, యాజకుడుగా సేవ చెయ్యడానికి అహరోనుకు, అతని కొడుకులకూ పవిత్ర వస్త్రాలు అనేవి.”
సన్నిధి గుడారం కోసం అర్పణలు
20ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా మోషే ఎదుట నుండి వెళ్ళిపోయారు. 21తరువాత ఎవరి హృదయం వాళ్ళను ప్రేరేపించినట్టు వాళ్ళంతా సన్నిధి గుడారం కోసం, దానిలోని సేవ అంతటికోసం, పవిత్ర వస్త్రాల కోసం అర్పణలు తెచ్చి యెహోవాకు సమర్పించారు.
22తమ హృదయాల్లో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారం వస్తువులు తీసుకువచ్చారు.
23ఇంకా, నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు వీటిలో ఏవేవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకువచ్చారు.
24వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరూ యెహోవాకు కానుకలు తెచ్చారు. సేవలో ఏ పని కోసమైనా ఉపయోగపడే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దాన్ని తెచ్చారు.
25నైపుణ్యం గల స్త్రీలు తమ చేతులతో వడికిన నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకు వచ్చారు.
26నేర్పు గల స్త్రీలు తమ జ్ఞానహృదయంతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు.
27నాయకులు ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, వెలగల రాళ్ళూ రత్నాలు, 28అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు.
29మోషేను చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలు ప్రజల్లో తమ మనస్సులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణను బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు.
బెసలేలు, అహోలీయాబు
నిర్గ 31:1-11
30మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు, 31“వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. 32రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. 33అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు. 34అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.
35వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమ 35: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.