ఆది 41:33-46

ఆది 41:33-46 IRVTEL

కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి. వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి. కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది” అని ఫరోతో చెప్పాడు. ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది. ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు. ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు. నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు. ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు. ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ “నమస్కారం చేయండి” అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు. ఫరో యోసేపుతో “నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు” అన్నాడు. ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు.