ఆదికాండము 41:33-46
ఆదికాండము 41:33-46 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి. వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి. కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది” అని ఫరోతో చెప్పాడు. ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది. ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు. ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు. నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు. ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు. ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ “నమస్కారం చేయండి” అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు. ఫరో యోసేపుతో “నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు” అన్నాడు. ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు.
ఆదికాండము 41:33-46 పవిత్ర బైబిల్ (TERV)
కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి. ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి. రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది. ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.” ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు. కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు. (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు. అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేశాడు. రెండో రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు. అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.” ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే మరో పేరు పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు. యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేశాడు.
ఆదికాండము 41:33-46 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశ మందంతటను అయిదవభాగము తీసికొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరవుచేత ఈ దేశము నశించి పోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగానుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక అతడు తన సేవకులను చూచి–ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను. మరియు ఫరో–దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములుగలవారెవరును లేరు. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో–చూడుము, ఐగుప్తు దేశ మంతటిమీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు–వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో–ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.
ఆదికాండము 41:33-46 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి. సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి. వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి. ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.” ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు. నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు. కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు. ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!” అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు. ఫరో యోసేపుకు జఫెనత్-ఫనేహు అనే పేరు పెట్టాడు, ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతును అతనికి భార్యగా ఇచ్చాడు. యోసేపు ఈజిప్టు దేశమంతటా పర్యటించాడు. యోసేపు ఈజిప్టు రాజైన ఫరో సేవ మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి, ఈజిప్టు దేశమంతా సంచరించాడు.