యెషయా 1
1
దుర్మార్గానికి పాల్పడి చెడిపోయిన యూదులు
1యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం.
2ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు.
“నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు.
3ఎద్దుకు తన యజమాని తెలుసు.
తన మేత తొట్టి గాడిదకు తెలుసు.
కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.”
4ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా,
దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ.
వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు.
ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు.
ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు.
5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి?
మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు?
మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే.
6అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు.
ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు.
అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు,
కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు.
7మీ దేశం పాడైపోయింది.
మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి.
మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు.
తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు.
8సీయోను కుమార్తె #1:8 సీయోను కుమార్తె యెరూషలేము పట్టణంద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా,
దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది.
9జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే,
మనం సొదొమలాగా ఉండేవాళ్ళం.
మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం.
10సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి.
గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి.
11“యెహోవా ఇలా అంటున్నాడు.
విస్తారమైన మీ బలులు నాకెందుకు?”
“దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి.
దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు.
12మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు,
నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు?
13అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం.
అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను.
14మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం.
వాటిని సహించలేక విసిగిపోయాను.
15మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను.
మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను.
మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.
16మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.
మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి.
మీ దుష్టత్వం మానండి.”
17మంచి చెయ్యడం నేర్చుకోండి.
న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.
తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.
వితంతువు పక్షాన నిలబడండి.
18యెహోవా ఇలా అంటున్నాడు.
“రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”
“మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,
అవి మంచులా తెల్లగా అవుతాయి.
కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.
19మీరు ఇష్టపడి నాకు లోబడితే,
మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.
20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,
కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.”
యెహోవా నోరు ఈ మాట పలికింది.
21నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది!
అది న్యాయంతో నిండి ఉండేది.
నీతి దానిలో నివాసం ఉండేది.
ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు.
22నీ వెండి మలినమైపోయింది.
నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది.
23నీ అధికారులు ద్రోహులు.
వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు.
అందరూ లంచం ఆశిస్తారు.
చెల్లింపుల వెంటబడతారు.
తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు.
వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు.
24కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు.
“వాళ్లకు బాధ! నా విరోధులపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను.
నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను.
25నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను.
నీలో ఉన్న చెత్తను శుద్ధిచేసి, నీ కల్మషం అంతా తీసేస్తాను.
26మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను.
ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను.
అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.”
27సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది.
28అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు.
యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు.
29“మీరు కోరుకున్న సింధూర వృక్షాలను#1:29 సింధూర వృక్షాలను విగ్రహ పూజ బట్టి మీరు సిగ్గుపడతారు.
మీరు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మీరు అవమానం పాలవుతారు.
30మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు.
31బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు.
అతని పని నిప్పు రవ్వలా ఉంటుంది. రెండూ కలిసి కాలిపోతాయి.
ఆర్పే వాళ్ళు ఎవరూ ఉండరు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 1: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.