యెషయా 2
2
దేవుని రాజ్యం విజయం సాధిస్తుంది
2:1-4; మీకా 4:1-3
1యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కొడుకు యెషయా దర్శనం ద్వారా గ్రహించినది.
2రాబోయే భవిష్యత్తులో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది.
అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది.
జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు.
3అనేక మంది వచ్చి ఇలా అంటారు.
“ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు,
ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా,
యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.”
ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది.
4ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు.
అనేక జాతులకు తీర్పు తీరుస్తాడు.
వాళ్ళు తమ కత్తులను నాగటి నక్కులుగానూ,
తమ ఈటెలను మోట కత్తులుగానూ సాగగొడతారు.
జనం మీదకి జనం కత్తి ఎత్తరు.
ఇంక ఎన్నడూ యుద్ధ సన్నాహాలు చెయ్యరు.
యెహోవా దినం
5యాకోబు వంశస్థులారా, రండి.
మనం యెహోవా వెలుగులో నడుద్దాం.
6యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు.
వాళ్ళు ఫిలిష్తీయుల్లాగా శకునం చూసే వాళ్ళలా ఉంటూ,
పరదేశులతో స్నేహం చేస్తున్నారు గనుక నువ్వు వాళ్ళను విడిచి పెట్టేశావు.
7వాళ్ళ దేశం వెండి బంగారాలతో నిండి ఉంది.
వాళ్ళ సంపాదనకు మితి లేదు.
వాళ్ళ దేశం గుర్రాలతో నిండి ఉంది.
వాళ్ళ రథాలకు మితి లేదు.
8వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది.
వాళ్ళు తమ స్వంత చేతి పనితనంతో చేసిన వాటికీ, తాము వేళ్ళతో చేసిన వాటికీ పూజలు చేస్తారు.
9ప్రజలు అణిచివేతకు గురౌతారు. వ్యక్తులు పడిపోతారు.
కాబట్టి వాళ్ళను అంగీకరించవద్దు.
10యెహోవా భీకర సన్నిధి నుంచి, ఘనత కలిగిన ఆయన మహిమ నుంచీ వెళ్లి గండ శిలల్లో, నేలలో దాగి ఉండు.
11మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు.
మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు.
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.
12గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు.
13సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ,
బాషాను సింధూర వృక్షాలన్నిటికీ,
14ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ,
15ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ,
16తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు.
17అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది.
మనుషుల గర్వం తగ్గిపోతుంది.
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.
18విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి.
19యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి,
ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో,
నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు.
20ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు.
ఎలుకలకూ, గబ్బిలాలకూ వాటిని విసిరేస్తారు.
21యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచీ,
ఆయన ప్రభావ మహత్యం నుంచీ పారిపోయి కొండ గుహల్లో,
కొండ బండల నెర్రెల్లో మనుషులు దాగి ఉంటారు.
22తన ముక్కుపుటాల్లో జీవవాయువు ఉన్న మనిషి మీద నమ్మకం ఉంచడం మానుకో.
అతని విలువ ఏ పాటిది?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 2: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.