యోహాను 13:21-30

యోహాను 13:21-30 IRVTEL

యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, “మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. ఆయన ఎవరి గురించి ఇలా చెబుతున్నాడో తెలియక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. భోజనం బల్ల దగ్గర, ఆయన శిష్యుల్లో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకుని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యుడికి, “యేసు ఎవరి గురించి అలా అన్నాడన్న విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకో” అని సైగ చేశాడు. ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకుని ఆయనతో, “ప్రభూ, ఆ వ్యక్తి ఎవరు?” అని అడిగాడు. అప్పుడు యేసు జవాబిస్తూ, “ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే” అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు. అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి” అన్నాడు. ఆయన అతనితో ఇలా ఎందుకు చెప్పాడో, బల్ల దగ్గర ఉన్నవాళ్ళకు తెలియలేదు. డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి యేసు అతనితో, “పండగకు కావలసినవి కొను” అని గాని, పేదవాళ్ళకు ఇమ్మని గాని చెప్పాడని వారిలో కొంతమంది అనుకున్నారు. అది రాత్రి సమయం. అతడు ఆ రొట్టె ముక్క తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు.