యోహాను 13:21-30
యోహాను 13:21-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు ఈ మాటలను చెప్పిన తర్వాత, తన ఆత్మలో కలవరపడి, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. ఆయన తమలో ఎవరిని గురించి చెప్తున్నాడోనని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంతో చూడసాగారు. ఆయన శిష్యులలో ఒకడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రక్కన కూర్చొని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, “ఆయన చెప్పేది ఎవరి గురించి అని ఆయనను అడుగు” అన్నాడు. అతడు యేసు రొమ్ముకు ఇంకా దగ్గరగా ఆనుకొని, “ప్రభువా, అతడు ఎవరు?” అని ఆయనను అడిగాడు. యేసు, “ఈ గిన్నెలో రొట్టె ముక్కను ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే” అని జవాబిచ్చారు. తర్వాత ఆయన రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చారు. యూదా ఆ రొట్టెను తీసుకొన్న వెంటనే సాతాను అతనిలోనికి ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు. కాని యేసు అతనితో ఇది ఎందుకు చెప్పాడో అని ఆ భోజనబల్ల దగ్గర ఉన్న ఎవరికీ తెలియలేదు. యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కనుక పండుగ కొరకు అవసరమైన వాటిని కొనడానికి లేదా, పేదవారికి ఏమైనా ఇవ్వుమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు. యూదా రొట్టెను తీసుకొన్న వెంటనే వెళ్లిపోయాడు. అది రాత్రి సమయం.
యోహాను 13:21-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, “మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. ఆయన ఎవరి గురించి ఇలా చెబుతున్నాడో తెలియక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. భోజనం బల్ల దగ్గర, ఆయన శిష్యుల్లో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకుని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యుడికి, “యేసు ఎవరి గురించి అలా అన్నాడన్న విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకో” అని సైగ చేశాడు. ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకుని ఆయనతో, “ప్రభూ, ఆ వ్యక్తి ఎవరు?” అని అడిగాడు. అప్పుడు యేసు జవాబిస్తూ, “ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే” అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు. అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి” అన్నాడు. ఆయన అతనితో ఇలా ఎందుకు చెప్పాడో, బల్ల దగ్గర ఉన్నవాళ్ళకు తెలియలేదు. డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి యేసు అతనితో, “పండగకు కావలసినవి కొను” అని గాని, పేదవాళ్ళకు ఇమ్మని గాని చెప్పాడని వారిలో కొంతమంది అనుకున్నారు. అది రాత్రి సమయం. అతడు ఆ రొట్టె ముక్క తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు.
యోహాను 13:21-30 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటున్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” అని సంజ్ఞ చేసాడు. అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, “ప్రభూ! ఎవరు!” అని అడిగాడు. యేసు, “నేనీ రొట్టె ముక్కను పాత్రలో ముంచి ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. తదుపరి రొట్టెముక్కను పాత్రలో ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు. రొట్టె తీసుకొన్న వెంటనే సైతాను వానిలోకి ప్రవేశించాడు. యేసు వానితో, “నీవు చేయబోయేదేదో త్వరగా చెయ్యి” అని అన్నాడు. కాని, భోజనానికి కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు కంటున్నాడో అర్థం కాలేదు. డబ్బు యూదా ఆధీనంలో ఉండేది. కాబట్టి పండుగకు కావలసినవి కొని తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరనుకున్నారు. యూదా రొట్టె తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం.
యోహాను 13:21-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడి–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు–ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు–నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు–నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు. డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటినికొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.
యోహాను 13:21-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత, తన ఆత్మలో కలవరపడి ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు. ఆయన తమలో ఎవరిని గురించి చెప్తున్నాడోనని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంతో చూడసాగారు. ఆయన శిష్యులలో ఒకడు అనగా యేసు రొమ్మును ఆనుకుని ఉన్న యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రక్కన కూర్చుని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, “ఆయన చెప్పేది ఎవరి గురించి అని ఆయనను అడుగు” అన్నాడు. అతడు యేసు రొమ్ముకు ఇంకా దగ్గరగా ఆనుకుని, “ప్రభువా, అతడు ఎవరు?” అని ఆయనను అడిగాడు. యేసు, “ఈ గిన్నెలో రొట్టె ముక్కను ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే” అని ఆయన ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చారు. యూదా ఆ రొట్టెను తీసుకున్న వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు. కాని యేసు అతనితో అలా ఎందుకు అన్నారో ఆ భోజనబల్ల దగ్గర ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కాబట్టి పండుగ కోసం అవసరమైన వాటిని కొనడానికో, పేదవారికి ఏమైనా ఇవ్వమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు. యూదా రొట్టెను తీసుకున్న వెంటనే వెళ్లిపోయాడు. అది రాత్రి సమయం.