యోహాను సువార్త 13:21-30

యోహాను సువార్త 13:21-30 OTSA

యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత, తన ఆత్మలో కలవరపడి ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు. ఆయన తమలో ఎవరిని గురించి చెప్తున్నాడోనని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంతో చూడసాగారు. ఆయన శిష్యులలో ఒకడు అనగా యేసు రొమ్మును ఆనుకుని ఉన్న యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రక్కన కూర్చుని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, “ఆయన చెప్పేది ఎవరి గురించి అని ఆయనను అడుగు” అన్నాడు. అతడు యేసు రొమ్ముకు ఇంకా దగ్గరగా ఆనుకుని, “ప్రభువా, అతడు ఎవరు?” అని ఆయనను అడిగాడు. యేసు, “ఈ గిన్నెలో రొట్టె ముక్కను ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే” అని ఆయన ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చారు. యూదా ఆ రొట్టెను తీసుకున్న వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు. కాని యేసు అతనితో అలా ఎందుకు అన్నారో ఆ భోజనబల్ల దగ్గర ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కాబట్టి పండుగ కోసం అవసరమైన వాటిని కొనడానికో, పేదవారికి ఏమైనా ఇవ్వమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు. యూదా రొట్టెను తీసుకున్న వెంటనే వెళ్లిపోయాడు. అది రాత్రి సమయం.