యోహాను 20:24-31

యోహాను 20:24-31 IRVTEL

పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు. ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు. తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు. దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు. అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు. యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు. కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.