యోహాను 20:24-31
యోహాను 20:24-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు–మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు–నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో–నా ప్రభువా, నా దేవా అనెను. యేసు–నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
యోహాను 20:24-31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పన్నెండు మంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు. కనుక మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూసాం” అని చెప్పారు. అప్పుడు అతడు వారితో, “నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును మరియు ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని, నేను నమ్మను” అన్నాడు. ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు, తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో చెప్పారు. తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు. తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు. అప్పుడు యేసు అతనితో, “నీవు నన్ను చూసి నమ్మినావు; చూడకుండానే నమ్మినవారు ధన్యులు” అన్నారు. యేసు తన శిష్యుల ముందు అనేక ఇతర అద్బుత క్రియలను చేశారు, వాటన్నిటిని ఈ పుస్తకంలో వ్రాయలేదు. అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మడానికి, ఆయన నామంను నమ్మడం ద్వారా మీరు జీవాన్ని పొందుకోవాలని ఈ సంగతులను వ్రాసాను.
యోహాను 20:24-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు. ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు. తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు. దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు. అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు. యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు. కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
యోహాను 20:24-31 పవిత్ర బైబిల్ (TERV)
యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు. ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు. తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు. నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు. యేసు “క్రీస్తు” అని, “దేవుని కుమారుడు” అని, ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.