యోబు 5
5
1నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?
2తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.
3మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.
4అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.
5ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.
6దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.
7నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.
8అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.
9ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
10ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.
11ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.
12వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.
13దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.
14వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.
15బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.
16కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.
17దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.
18ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.
19ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.
20కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
21దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.
22కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.
23నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.
24నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.
25నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.
26ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.
27ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 5: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.