యోబు 6

6
యోబు జవాబు
1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు.
2ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారు గాక. నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారు గాక.
3అలా చేసినప్పుడు నా దుఃఖం సముద్రంలో ఉన్న ఇసక కన్నా బరువుగా ఉంటుంది. అందుకనే నేను వ్యర్ధమైన మాటలు పలికాను.
4సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరసగా నిలిచి ఉన్నాయి.
5అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా?
6ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా?
7అలాంటి వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది.
8నా విన్నపాలు తీరితే ఎంత బాగుంటుంది! నేను కోరినదంతా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది!
9దేవుడు తన ఇష్టప్రకారం నన్ను నలగ్గొడతాడు గాక. తన చెయ్యి ఎత్తి నన్ను కడతేరుస్తాడు గాక.
10ఇదే నాకు ఓదార్పు అవుతుంది. మానని నొప్పిని బట్టి నేను అతిశయపడతాను. అప్పుడు కనీసం పరిశుద్ధ దేవుని మాటలను తోసిపుచ్చలేదన్న ఆదరణన్నా నాకు మిగులుతుంది.
11నాకున్న బలం ఎంత? నేను దేని కోసం ఎదురు చూడాలి? నా అంతిమ స్థితి ఏమిటి? ఇదంతా నేను ఎందుకు ఓర్చుకోవాలి?
12నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా?
13నాలో నుంచి నాకు సహాయం ఏమీ దొరకదు గదా. నాలో నుండి నా శక్తి అంతా సన్నగిల్లిపోయింది గదా.
14కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు.
15నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు.
16అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి.
17వేసవికాలంలో అవి మాయమైపోతాయి. వేడి తగిలినప్పుడు అవి ఉన్నచోట్ల నుండి ఆవిరైపోతాయి.
18వాటి నుండి ప్రవహించే నీళ్ళు దారి మళ్ళుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి.
19తేమా నుండి గుంపులుగా బయలు దేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. షేబ వర్తకులు వాటి కోసం ఆశిస్తారు.
20వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు. వాటిని సమీపించి కలవరానికి గురౌతారు.
21మీరు ఆ ప్రవాహం వలే ఉండీ లేనట్టుగా ఉన్నారు. నా దీన స్థితిని చూసి మీరు భయపడుతున్నారు.
22నాకు ఏమైనా సహాయం చేయమని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం భాగం ఏమైనా ఇమ్మని అడిగానా?
23శత్రువు చేతిలోనుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధ పెడుతున్నవాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా?
24నాకు మంచి మాటలు చెప్పండి. నేను మౌనంగా మీరు చెప్పేది వింటాను. ఏ ఏ విషయాల్లో నేను తప్పిపోయానో నాకు తెలియపరచండి.
25యథార్థమైన మాటలు ఎంతో ప్రభావం చూపుతాయి. అయినా మీ గద్దింపుల వల్ల ప్రయోజనం ఏమిటి?
26నా మాటలను ఖండించాలని మీరు అనుకుంటున్నారా? నిరాశాపూరితమైన నా మాటలు గాలిలో కొట్టుకుపోతాయి గదా.
27మీరు తండ్రిలేని అనాథలను కొనేందుకు చీట్లు వేసే మనుషుల వంటివారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది.
28దయచేసి నన్ను చూడండి. మీ సమక్షంలో నేను అబద్ధాలు చెబుతానా?
29ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి, ఈ విషయాల్లో నేను నిర్దోషిని.
30నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా?

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 6: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి