విలాప 3
3
విలాపం, నిరీక్షణ
1నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి.
2ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు.
3నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.
4ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు.
5నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు.
6ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు.
7ఆయన నా చుట్టూ గోడ కట్టాడు.
నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు.
8నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు.
9ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు.
నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు. 10నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు.
దాగి ఉన్న సింహంలా ఉన్నాడు.
11నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు.
12విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు.
13తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు.
14నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను.
ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు.
15చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు.
విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.
16రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు.
17నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.
18కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.
19నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.
20కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.
21కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.
22యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
23ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.
నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!
24“యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.
కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.
25తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.
26యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.
27తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.
28అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి.
29ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.
30అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి.
అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.
31ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.
32ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.
33హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.
34దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,
35మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,
36ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?
37ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?
38మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?
39బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?
40మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.
41ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం.
42మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.
43నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.
44మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.
45జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు.
46మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు.
47గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.
48నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది.
49యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,
50నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.
51నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.
52ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు.
53వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు.
54నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను.
55యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను.
56సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు.
57నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.
58ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.
59యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.
60నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు.
61యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు.
62నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు.
63యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి.
64యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు.
65వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు.
66యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
విలాప 3: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.