లూకా 15:11-24

లూకా 15:11-24 IRVTEL

ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో చిన్నవాడు ‘నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు’ అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు. కొద్ది రోజుల తరువాత చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతనికి ఇబ్బందులు మొదలైనాయి. దాంతో అతడు వెళ్ళి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి అతనిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు. అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు. అతనికి బుద్ధి వచ్చింది. అతడిలా అనుకున్నాడు, ‘నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు. నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను.’ ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కొడుకు తండ్రితో, ‘నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు’ అన్నాడు. “అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.