ఫిలిప్పీ పత్రిక 4:1-9

ఫిలిప్పీ పత్రిక 4:1-9 IRVTEL

కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. నా ఆనందం, నా కిరీటంగా ఉన్న నా ప్రియ మిత్రులారా, ప్రభువులో స్థిరంగా ఉండండి. ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి. ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి. మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది. చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.