ఫిలిప్పీయులకు 4:1-9

ఫిలిప్పీయులకు 4:1-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

కనుక, నా సహోదరీ సహోదరులారా, నా ఆనందం నా కిరీటమైన నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఈ విధంగా మీరు ప్రభువులో స్థిరంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండుమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. అవును, నా నిజమైన సహకారి, ఈ స్త్రీలు క్లెమెంతుతో, మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. కనుక వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడివున్నాయి. ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి. మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు. దేనిని గురించి వేదన పడకండి, గాని ప్రతివిషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది. చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి. మీరు నా నుండి ఏవి నేర్చుకొన్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూసారో వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.

ఫిలిప్పీయులకు 4:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. నా ఆనందం, నా కిరీటంగా ఉన్న నా ప్రియ మిత్రులారా, ప్రభువులో స్థిరంగా ఉండండి. ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి. ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి. మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది. చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

ఫిలిప్పీయులకు 4:1-9 పవిత్ర బైబిల్ (TERV)

నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి. యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతావాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతావాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి. మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి. దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది. కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి. మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.

ఫిలిప్పీయులకు 4:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారీ ఆ స్ర్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై యుండును.

ఫిలిప్పీయులకు 4:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కాబట్టి, నా సహోదరీ సహోదరులారా, నా ఆనందం నా కిరీటమైన నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఈ విధంగా మీరు ప్రభువులో స్థిరంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. అవును, నా నిజమైన సహకారీ, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఈ స్త్రీలు క్లెమెంతుతో మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడ్డారు. కాబట్టి వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా. ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి. మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు. దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది. చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి. మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.